
ఆర్‌బీఐ రుణాలపై ఆధారపడిన ఏపీ ప్రభుత్వం: కాగ్ నివేదిక
2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు మొత్తం కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి రుణాలపైనే ఆధారపడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ఏడాదిలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఎటువంటి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (డబ్ల్యుఏంఏ) తీసుకోకుండా ఆర్‌బీఐ వద్ద కనీస నగదు నిల్వను నిర్వహించగలిగిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కాగ్ నివేదిక ప్రకారం 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రాయింగ్ సౌకర్యం (ఎస్ డి ఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (డబ్ల్యుఏంఏ ) ఓవర్‌డ్రాఫ్ట్‌ల ద్వారా మొత్తం రూ.1.72 లక్షల కోట్ల వరకు రుణాలు పొందింది. ఈ రుణాలపై రాష్ట్రం రూ.303 కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు నివేదిక తెలిపింది. రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వడ్డీ భారం కూడా గణనీయంగా పెరిగినట్లు కాగ్ పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో మరో ఆందోళనకర అంశంగా రెవెన్యూ లోటు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం ప్రకారం రెవెన్యూ లోటు జీఎస్‌డీపీకి 2.7 శాతం లోపు ఉండాలి. అయితే 2024–25లో అది 3.75 శాతానికి చేరిందని కాగ్ వెల్లడించింది. అదే విధంగా ఆర్థిక లోటు కూడా అనుమతించబడిన 4 శాతం పరిమితిని దాటుతూ 5.05 శాతానికి చేరినట్లు పేర్కొంది.
ఇక రాష్ట్ర మొత్తం రుణభారం కూడా గణనీయంగా పెరిగిందని. 2024–25లో మొత్తం రుణాలు రూ.81,071 కోట్లకు చేరినట్లు తెలిపింది. దీంతో మూలధన వ్యయానికి కేటాయించే నిధులు తగ్గిపోయి, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి అవసరమైన పెట్టుబడులపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని కాగ్ హెచ్చరించింది.
రుణాల వినియోగంపై కూడా కాగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న మొత్తం రుణాల్లో కేవలం 24 శాతం మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2024–25లో రూ.87,773 కోట్ల రుణాల్లో కేవలం రూ.21,173 కోట్లు మాత్రమే మూలధన ఆస్తుల సృష్టికి వినియోగించినట్లు తెలిపింది. మిగిలిన నిధులు ఇతర ఖర్చులకు వెచ్చించినట్లు పేర్కొంది.
అదేవిధంగా 2024–25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్-బడ్జెట్ రుణాల వివరాలను వెల్లడించలేదని అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా అలాంటి రుణాలు తీసుకోలేదని సమాచారం ఇచ్చినప్పటికీ 2025 మార్చి 31 నాటికి రూ.27,241.99 కోట్లు ఆఫ్-బడ్జెట్ బాకీలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా ఈ అంశంపై స్పందించిన టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ 2024 జూన్ 10న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.38,000 కోట్ల వరకు అప్పులు చేసిందని తెలిపారు. మిగిలిన కాలంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుమారు రూ.42,000 కోట్ల మేర రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు వంటి గత ప్రభుత్వపు బకాయిలు కారణంగానే ఆర్‌బీఐ రుణాలపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
