Let's talk: editor@tmv.in
ఆర్బీఐ భారీగా నగదు విడుదల చేసినా మార్కెట్లలో తగ్గని ఒత్తిడి

ఆర్బీఐ భారీగా నగదు విడుదల చేసినా మార్కెట్లలో తగ్గని ఒత్తిడి

Dantu Vijaya Lakshmi Prasanna
29 జనవరి, 2026

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 5.5 లక్షల కోట్ల మేర నగదును (లిక్విడిటీ) మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ, దాని ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్ తన 'ఎకోర్యాప్' నివేదికలో వెల్లడించింది. ఆర్‌బీఐ రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటు, సిఆర్‌ఆర్ చర్యలు, బై-సెల్ స్వ్యాప్‌ల ద్వారా చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులను వ్యవస్థలోకి పంపింది. అయితే, ఈ భారీ లిక్విడిటీ ఉన్నప్పటికీ మనీ మార్కెట్, బాండ్ ఈల్డ్‌లు దానికి అనుగుణంగా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది.

మరోవైపు, బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు వేగంగా తగ్గినప్పటికీ, వాణిజ్య మార్కెట్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ వంటి మార్కెట్ రేట్లు 2025 ఆగస్టు నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. అదేవిధంగా, కార్పొరేట్ బాండ్ల వడ్డీ రేట్లు, రాష్ట్ర ప్రభుత్వాల రుణ వ్యయాలు కూడా తగ్గకపోగా, మార్కెట్లో రిస్క్ ప్రీమియం పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆర్‌బీఐ తీసుకుంటున్న ద్రవ్యపరమైన చర్యలు మార్కెట్లోని అన్ని విభాగాలకు సమానంగా చేరడం లేదని స్పష్టమవుతోంది.

ఈ వ్యత్యాసాలను సరిదిద్దడానికి ఆర్‌బీఐ తన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వ్యూహాన్ని మార్చుకోవాలని ఎస్‌బీఐ రీసెర్చ్ సూచించింది. తక్కువ డిమాండ్ ఉన్న పత్రాల కంటే, మార్కెట్లో నిరంతరం ట్రేడింగ్ జరిగే 'లిక్విడ్ బెంచ్‌మార్క్' సెక్యూరిటీలపై దృష్టి సారించాలని కోరింది. తద్వారా మార్కెట్లోకి బలమైన సంకేతాలు పంపి, వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు పెట్టుబడిదారులకు, రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో అందేలా చూడవచ్చని నివేదిక స్పష్టం చేసింది.

ఎస్‌బీఐ ఎకోర్యాప్‌తో పాటు ఇతర ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా మార్కెట్ పరిస్థితులపై కీలక గణాంకాలను విడుదల చేశాయి. క్రిసిల్ తన తాజా నివేదికలో 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌లు 6.57% - 6.67% మధ్య ఉండవచ్చని అంచనా వేయగా, కార్పొరేట్ బాండ్ ఈల్డ్‌లు అంతకంటే ఎక్కువగా 7.31% - 7.41% వరకు ఉండవచ్చని పేర్కొంది, ఇది మార్కెట్లో పెరుగుతున్న రిస్క్ ప్రీమియంను సూచిస్తోంది.

ఐసీఆర్ఏ విశ్లేషణ ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.0% ఉండవచ్చని, అయితే బ్యాంకుల డివిడెండ్ చెల్లింపులు ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చని తెలిపింది. మరోవైపు, నోమురా, గోల్డ్‌మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు, ఆర్‌బీఐ చేపడుతున్న ద్రవ్య విధాన సడలింపుల వల్ల 2026 చివరలో మార్కెట్ పుంజుకుంటుందని, నిఫ్టీ 29,300 స్థాయికి చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాల భారీ అప్పుల వల్ల మార్కెట్లో నిధుల లభ్యత ఒత్తిడిలోనే ఉందని ఈ నివేదికలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్బీఐ భారీగా నగదు విడుదల చేసినా మార్కెట్లలో తగ్గని ఒత్తిడి - Tholi Paluku