Let's talk: editor@tmv.in
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సోనాలి సేన్ గుప్తా నియామకం

ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సోనాలి సేన్ గుప్తా నియామకం

Yellarthi Chennabasava
12 అక్టోబర్, 2025

భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సోనాలి సేన్ గుప్తాను నియమించింది. ఈ నియామకం అక్టోబర్ 9, 2025 నుంచి అమలులోకి వచ్చినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరుకు సోనాలి సేన్ గుప్తా బెంగళూరులోని ఆర్బీఐ కర్ణాటక ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆర్బీఐ లో సేవలందించిన ఆమె బ్యాంకింగ్ నియంత్రణ, మానవ వనరుల నిర్వహణ, పర్యవేక్షణ వంటి కీలక రంగాల్లో విస్తృత అనుభవం సంపాదించారు. కొత్త బాధ్యతల్లో ఆమె కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్, అభివృద్ధి, ఇన్‌స్పెక్షన్ విభాగాలను నడిపిస్తారు.

బ్యాంకింగ్,ఫైనాన్స్‌లో ఎంబీఏ తో పాటు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన సోనాలి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబిఎఫ్) సర్టిఫైడ్ అసోసియేట్ కూడా. ఆర్బీఐ లో తన సుదీర్ఘ కెరీర్‌లో ఆమె జి20 గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (జిపిఎఫ్ఐ), ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఐఎన్ఎఫ్ఈ) వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్‌ను సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాక నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సిఎఫ్ఈ) బోర్డులో డైరెక్టర్‌గా ఆర్బీఐ పాలసీలను రూపొందించే అనేక కమిటీల్లో సభ్యురాలిగా సేవలందించారు. ప్రస్తుతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బోర్డులో ఆర్బీఐ నామినీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆమె నాయకత్వంలో ఆర్బీఐ సేవలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాయని ఆశిస్తున్నారు.

ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సోనాలి సేన్ గుప్తా నియామకం - Tholi Paluku