
ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు: సీపీ సజ్జనార్
కేంద్ర బ్యాంక్ పేరు చెప్పుకుని కొత్త తరహా ఆన్‌లైన్ మోసాలకు సైబర్ నేరగాళ్లు తెరలేపుతున్నారు. ఈసారి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రవేశపెట్టిన ‘ఉద్గమ్’ పోర్టల్నే ఆయుధంగా చేసుకుని ప్రజలను మోసగిస్తున్నారు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ కాకుండా ఉన్న డిపాజిట్లు ఇప్పిస్తామని ఆశ చూపిస్తూ, ఖాతాలు ఖాళీ చేసే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు.
మోసం ఎలా జరుగుతుందంటే?
మీ పాత బ్యాంక్ ఖాతాల్లో లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని. వెంటనే ఈ లింక్‌పై క్లిక్ చేసి తీసుకోండి అంటూ వాట్సాప్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు. ఆ లింక్‌ను నమ్మి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతోంది. ఆపై బ్యాంకింగ్ యాప్‌లు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి క్షణాల్లో ఖాతాల్లోని డబ్బును దోచేస్తున్నారు.
ఈ మోసాలపై ఆర్బీఐతో పాటు సైబర్ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆర్బీఐ లేదా బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు అడగరని గుర్తుంచుకోండి. అలాంటి కాల్స్ వస్తే అవి కచ్చితంగా మోసాలేనని గుర్తించాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాల కోసం ప్రజలు తప్పనిసరిగా ఆర్బీఐ అధికారిక ‘ఉద్గమ్’ పోర్టల్ ( https://udgam.rbi.org.in ) ను మాత్రమే ఉపయోగించాలి. సోషల్ మీడియా, వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలని సీపీ సజ్జనార్ కోరారు.
మోసపోతే ఏం చేయాలి?
ఒకవేళ పొరపాటున ఇలాంటి మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. లేదంటే https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. సమయానికి చర్యలు తీసుకుంటే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం భారీ నష్టానికి దారి తీస్తుందనే విషయం గుర్తుంచుకుని, అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచిస్తున్నారు.
నేరగాళ్లు వాడే నకిలీ అడ్రస్‌లు ఇలా ఉంటాయి
https://rbi-udgam.in
https://udgam-rbi.com
https://rb i-udgam.org
https://udgam.verify-now.link
https://udgamrbi.co.in
నకిలీ లింకులు సాధారణంగా ఇలా కనిపిస్తాయి,చూడటానికి బాగానే ఉన్నా, చివరి భాగం మారితే అది మోసమే.
ఒక్క లైన్‌లో గుర్తుపెట్టుకోండి
.rbi.org.in లేకపోతే అది ఉద్గమ్ కాదు, మోసమే.
