
ఆర్థిక సర్వే 2025-26 “భారత సంస్కరణల ఎక్స్‌ప్రెస్": ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 'ఆర్థిక సర్వే 2025-26'పై స్పందిస్తూ, ఈ ఆర్థిక సర్వే 2025-26 ను భారత దేశ 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' కు అద్దం పట్టేలా ఉందని కొనియాడారు. అంతర్జాతీయంగా సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, భారత్ సాధిస్తున్న స్థిరమైన పురోగతిని ఈ సర్వే స్పష్టంగా వివరిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన దేశం యొక్క బలమైన స్థూల ఆర్థిక పునాదులు, నిరంతరం కొనసాగుతున్న వృద్ధి గమనం. దేశ నిర్మాణంలో నవకల్పనలు, వ్యవస్థాపకత, మౌలిక సదుపాయాల విస్తరణ ఏ విధంగా తోడ్పడుతున్నాయో ఈ నివేదిక హైలైట్ చేస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఈ సర్వే 'సమ్మిళిత అభివృద్ధి' కి అత్యంత ప్రాముఖ్యతనిచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. ముఖ్యంగా రైతులు, ఎంఎస్ఎంఈ రంగాలు, యువత ఉపాధి సామాజిక సంక్షేమంపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం ద్వారా 'వికసిత్ భారత్' లక్ష్యం వైపు మనం వేగంగా అడుగులు వేయడానికి ఈ సర్వే ఒక రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
చివరగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్‌కు సమాధానమిస్తూ, ఈ సర్వే అందించిన లోతైన అంశాలు భవిష్యత్తులో సమర్థవంతమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది భారత ఆర్థిక భవిష్యత్తుపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింతగా పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
