Let's talk: editor@tmv.in
ఆర్థిక సంస్కరణలే భారత్ ఎదుగుదలకు బాటలు

ఆర్థిక సంస్కరణలే భారత్ ఎదుగుదలకు బాటలు

Panthagani Anusha
17 నవంబర్, 2025

దేశ ఆర్థిక పురోగతిని తీర్చిదిద్దడంలో సంస్కరణలు కీలక పాత్ర పోషించాయని, మరో ఏడాదిలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని 2047 స్వాతంత్రం శతాబ్దోత్సవ నాటికి ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.

“ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి. వాటి ప్రభావంతో భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది అని సీఎం అన్నారు. 2047 నాటికి భారతీయ ప్రతి వ్యక్తి ఆదాయం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రభావం మరింత విస్తృతమవుతుందని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ పాత్రను ప్రస్తావిస్తూ నాలుగు రాజ్యాంగ స్తంభాల్లో న్యాయవ్యవస్థ అత్యంత స్థిరత్వాన్ని కలిగినది. శాసన, కార్యనిర్వాహక, మీడియా రంగాల్లో ఎక్కడైనా గందరగోళాలు, అడ్డంకులు వచ్చిన ప్రజాస్వామ్యాన్ని సరైన దిశలో నడిపేది న్యాయవ్యవస్థే అని చెప్పారు.

సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.