Let's talk: editor@tmv.in
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌!

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌!

Venkatesh Balusula
14 అక్టోబర్, 2025

ఆర్థిక రంగంలో విశేష సేవ‌లందిస్తూ, ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిని ఎలా నడిపిస్తాయో, కొత్త సాంకేతికతలు పాత వాటిని ఎలా భర్తీ చేస్తాయో వివరించినందుకుగానూ అమెరికాకు చెందిన‌ జోయెల్ మోకిర్, ఫ్రాన్స్‌కు చెందిన‌ ఫిలిప్పే అగియన్, కెన‌డాకు చెందిన‌ పీటర్ హోవిట్‌లను ప్ర‌సిద్ధ నోబెల్ పుర‌స్కారం వ‌రించింది. ఈ మేర‌కు సోమవారం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ పరిశోధనలు "క్రియేటివ్ డిస్ట్రక్షన్" అనే కీలక ఆర్థిక భావనను వివరించినందుకు అందించారు. ఇందులో కొత్త ఆవిష్కరణలు పాత సాంకేతికతలను, వ్యాపారాలను ఎలా రూపుమాపి అభివృద్ధి దిశ‌గా ముందుకు సాగుతాయ‌న్న దానిని వారు వివ‌రించారు.

మోకిర్ (79) నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో చరిత్ర ఆధారంగా దీర్ఘకాల ఆర్థిక ధోరణులపై అధ్యయనం చేశారు. అగియన్ (69) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో, హోవిట్ (79) బ్రౌన్ యూనివర్సిటీలో గణిత నమూనాలతో క్రియేటివ్ డిస్ట్రక్షన్ విధానాల‌ను వివరించారు. నోబెల్ పుర‌స్కారం వ‌చ్చిన సంద‌ర్భంగా మోకిర్‌కు స్టాక్‌హోమ్ నుంచి ఫోన్ కాల్ రాగా ఆయ‌న షాక‌య్యారు. "నాకు కాఫీ తాగే సమయం కూడా లేదు, నోబెల్ వస్తుందని ఊహించలేదు" అని చెప్పారు. తన విద్యార్థులు నోబెల్ గురించి అడిగితే "నేను పోప్ అయ్యే అవకాశం ఎక్కువ" అని జోక్ చేశానని, తాను యూదుడినని నవ్వుతూ చెప్పారు. 80వ ఏటకు చేరుతున్నా రిటైర్ కావడం లేదని, ఈ పని తన డ్రీమ్ జాబ్ అని వెల్ల‌డించారు. అగియన్ కూడా ఈ పుర‌స్కారంపై ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. ఈ భావ‌న‌ను వ్య‌క్తం చేయ‌డానికి మాట‌లు రావ‌డం లేద‌ని స్టాక్‌హోమ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఫోన్‌లో చెప్పారు. తనకు పురస్కారంతో వ‌చ్చిన న‌గ‌దు బ‌హుమ‌తిని త‌న‌ పరిశోధన కేంద్రంలో పెట్టుబడిగా పెడతానని చెప్పారు. అమెరికా రక్షణవాదం గురించి మాట్లాడుతూ ఇది ప్రపంచ వృద్ధికి, ఆవిష్కరణలకు మంచిది కాద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు పరిశోధకులు క్రియేటివ్ డిస్ట్రక్షన్‌ను స్పష్టంగా వివరించారు. ఈ భావనను 1942లో ఆర్థికవేత్త జోసెఫ్ షుంపెటర్ "క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ" పుస్తకంలో ప్రతిపాదించారు. ఆవిష్కరణలు విజయవంతం కావాలంటే, అవి ఎందుకు పని చేస్తాయో శాస్త్రీయ వివరణలు కావాలని మోకిర్‌ చూపించారు. అగియన్, హోవిట్ 1992లో గణిత నమూనాతో నిరంతర ఆర్థిక వృద్ధి వెనుక ఉన్న విధానాలను వివరించారు. అగియన్ 2017లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఎన్నికల ఆర్థిక కార్యక్రమాన్ని రూపొందించడంలో సహాయపడ్డారు. 2024లో ఫ్రాన్స్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలపడానికి 25 సిఫార్సులతో నివేదిక సమర్పించారు. ఆర్థిక వృద్ధిని సాధ్యం చేసే ఆవిష్కరణలు ఆగిపోతే స్తబ్దత వస్తుంద‌ని, క్రియేటివ్ డిస్ట్రక్షన్ విధానాలను కాపాడుకోవాల‌ని పురస్కార కమిటీ చైర్ జాన్ హాస్లర్ చెప్పారు. సుమారు 1.2 మిలియన్ డాలర్ల న‌గ‌దు బ‌హుమ‌తిని సగం మోకిర్‌కు, మిగిలిన సగం అగియన్, హోవిట్‌లకు సమానంగా పంచ‌నున్నారు. విజేతలకు 18 క్యారెట్ల‌ బంగారు పతకం, డిప్లొమా కూడా అందిస్తారు.

క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే..

పురాత‌న విధానాల‌కు స్వ‌స్తి చెప్పి నూత‌న విధానాలు పాటిస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంద‌న్నది క్రియేటివ్ డిస్ట్రక్షన్ ముఖ్య ఉద్దేశం. కొత్త ఆవిష్కరణలు పాత పద్ధతులను, పాత పరిశ్రమలను, పాత ఉత్పత్తులను రూపుమాపిన‌ప్ప‌టికీ, అవే కొత్త అవకాశాలను, కొత్త పరిశ్రమలను, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయ‌ని అర్థం. ఉదాహ‌ర‌ణ‌కు గ‌తంలో సాధార‌ణ మొబైల్ ఫోన్‌లు వాడినా, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చేశాయి. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఆ పాత కంపెనీలు చాలావరకు మూతపడ్డాయి. కానీ ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్, మొబైల్ సర్వీసులు, ఆన్‌లైన్ వ్యాపారాలు వంటి కొత్త రంగాలు పుట్టుకొచ్చాయి. మ‌రోవైపు గ‌తంలో ప్ర‌యాణానికి గుర్రాలు, ఎడ్ల‌ బండ్లు వాడేవారు. ఇప్పుడు కార్లు, బైక్‌లు వాడుతున్నారు. ఈ వాహ‌నాలు వచ్చిన తర్వాత గుర్రాల బండ్ల వ్యాపారం తగ్గిపోయింది. కానీ ఆటోమొబైల్ పరిశ్రమ, పెట్రోల్ బంకులు, రోడ్లు, రవాణా రంగం వంటి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలా ఆర్థిక రంగంలో కూడా కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ప్పుడే అభివృద్ధి దిశ‌గా ముందుగుసాగ‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

నోబెల్ పుర‌స్కారాల విశిష్ట‌త‌

నోబెల్ పురస్కారాలు ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌కు, సంస్థ‌ల‌కు అందిస్తారు. ఇవి అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త పుర‌స్కారాలుగా పేరొందాయి. నోబెల్ పురస్కారాల వ్యవస్థను అల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడన్ శాస్త్రవేత్త స్థాపించాడు. మొదటిసారిగా నోబెల్ పురస్కారాలు 1901 సంవత్సరంలో అందజేశారు. 1901 నుంచి 2025 మధ్యకాలంలో 628 సార్లు పురస్కారాలు అంద‌జేశారు. ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన‌ 1,015 వ్యక్తులు, సంస్థలు ఈ పుర‌స్కారాలు అందుకున్నారు. మొత్తం ఆరు రంగాల్లో నోబెల్ పురస్కారాలు ఇస్తారు. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాల‌తో పాటు సాహిత్యం, శాంతి వంటి రంగాల్లో అంద‌జేస్తారు. నోబెల్ పురస్కారాలను వివిధ సంస్థలు ప్రకటిస్తాయి. సాహిత్య రంగంలో విజేత‌ల‌కు స్వీడిష్ అకాడమీ, భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్రంలో విజేత‌ల‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ, శరీర శాస్త్రం లేదా వైద్య శాస్త్రంలో సేవ‌ల‌కు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, శాంతి పుర‌స్కారాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్ర‌క‌టిస్తుంది.

2025 నోబెల్ విజేత‌లు వీరే

2025 సంవ‌త్స‌రానికి నోబెల్ పురస్కారాల ప్రకటనలు పూర్తయ్యాయి. ఈ పురస్కారాల‌ను డిసెంబర్ 10న స్వీడన్, నార్వేలో అందజేస్తారు. ఈ ఏడాది ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌ను గుర్తించి పుర‌స్కారాలు ప్ర‌క‌టించారు. వైద్య రంగంలో రోగ నిరోధ‌క‌త పని తీరును అర్థం చేసుకోవడానికి కృషి చేసిన అమెరికాకు చెందిన‌ మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జ‌పాన్‌కు చెందిన‌ షిమోన్ సకాగుచిలకు పురస్కారం లభించింది. వీరి పరిశోధనలు ప‌లు వ్యాధుల చికిత్సలకు మార్గం సుగమం చేశాయి. ఈ రంగంలో అమెరికా, జపాన్ దేశాలు ముందంజలో ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లలో శ‌క్తిపై చేసిన ప‌రిశోధ‌న‌ల‌కుగానూ అమెరికాకు చెందిన జాన్ క్లార్క్, మిచెల్ హె డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్‌ల‌కు పురస్కారం అంద‌జేయ‌నున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు, సెన్సార్లు అభివృద్ధికి వీరి ప‌రిశోధ‌న‌లు దోహదపడ‌నున్నాయి. వాతావ‌ర‌ణ మార్పుల కోసం చేసిన ప్ర‌యోగాల‌తో రసాయన శాస్త్రంలో చేసిన సేవ‌ల‌కు గానూ జ‌పాన్‌కు చెందిన‌ సుసుము కిటాగవా, ఆస్ట్రేలియాకు చెందిన‌ రిచర్డ్ రాబ్సన్, అమెరికాకు చెందిన‌ ఓమర్ ఎం యాఘిలకు పుర‌స్కారం ల‌భించింది. సాహిత్యంలో ఆకర్షణీయ, దూరదృష్టి రచనలకుగానూ హంగేరీ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకు పురస్కారం అందించ‌నున్నారు. శాంతి విభాగంలో వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కులు, నియంత‌ పాలన నుంచి శాంతి కోసం శ్రమించిన‌ వెనిజులా విపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు పురస్కారం అందించ‌నున్నారు.

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌! - Tholi Paluku