Let's talk: editor@tmv.in
ఆర్థిక వ్యవస్థకు మూలం బలమైన న్యాయ వ్యవస్థే: సీజేఐ సూర్యకాంత్

ఆర్థిక వ్యవస్థకు మూలం బలమైన న్యాయ వ్యవస్థే: సీజేఐ సూర్యకాంత్

Pinjari Chand
12 ఏప్రిల్, 2026

భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే కేవలం పెట్టుబడులు లేదా ప్రభుత్వ విధానాలు సరిపోవని, బలమైన, విశ్వసనీయమైన న్యాయ వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ అన్నారు. బార్‌‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ‘రూల్‌ ఆఫ్‌ లా కన్వెన్షన్‌ 2026’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లీగల్‌ రీఫార్మ్‌ రోడ్‌మ్యాప్‌ టూ ఏ యూఎస్‌డీ 10 ట్రిలియన్‌ భారత్‌’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు.

పెట్టుబడులకు నమ్మకం అవసరం

దేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు రావాల్సి ఉంటుందని, వాటికి న్యాయ వ్యవస్థపై పెట్టుబడిదారులకు నమ్మకం ఉండటం అత్యంత అవసరమని ఆయన చెప్పారు. పెన్షన్ ఫండ్లు మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం, టెక్నాలజీ సంస్థలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం లేదా అంతర్జాతీయ తయారీ సంస్థలు సరఫరా గొలుసులను ఏర్పాటు చేయడం వంటి పెట్టుబడులు దీర్ఘకాలిక నిబద్ధతతో ఉంటాయని తెలిపారు.

నమ్మకం – వ్యాపారానికి మూలం

పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ భవిష్యత్తులోనూ స్థిరంగా, పారదర్శకంగా కొనసాగుతుందా అనే విషయంపై ముందుగా నమ్మకం కలిగి ఉండాలని సీజేఐ పేర్కొన్నారు. ఇది కేవలం ఒప్పందం ఉల్లంఘన జరిగిన తర్వాత అమలు చర్యల గురించి మాత్రమే కాదు, ఒప్పందాలు అమలయ్యే మొత్తం కాలంలో నమ్మకం కొనసాగడం గురించి కూడా అని ఆయన అన్నారు.

కమర్షియల్ వివాదాల స్వరూపం మారింది

గత రెండు దశాబ్దాల్లో వ్యాపార వివాదాల స్వభావం కూడా మారిపోయిందని సూర్యకాంత్ తెలిపారు. ముందుగా చెల్లింపుల లోపం లేదా సరఫరా ఒప్పందాల ఉల్లంఘన వంటి సరళమైన అంశాలపై వివాదాలు ఉండేవి. ఇప్పుడు వ్యాపార సంబంధాలు మరింత క్లిష్టంగా మారడంతో వివాదాల స్వరూపం కూడా సంక్లిష్టంగా మారిందన్నారు.

మూడు కీలక అంశాలు

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే న్యాయ వ్యవస్థ కోసం మూడు ముఖ్య అంశాలు అవసరమని ఆయన చెప్పారు.

• అంచనా వేయడం: ప్రభుత్వం మారినా, పరిస్థితులు మారినా చట్టం ఒకే విధంగా అమలవ్వాలి.

• వివాద నివారించడం : ఒప్పందాల అమలులో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించాలి.

• ప్రత్యేక నైపుణ్యం: మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్‌, డిజిటల్ వ్యవస్థల వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం అవసరం.

మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం

వివాదాలు కోర్టుకు వెళ్లే ముందు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే సంస్కృతి పెంపొందితే భారత ఆర్థిక పోటీతత్వానికి అది చాలా మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లిటిగేషన్ మొదటి చర్య కాకుండా చివరి ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను ప్రధాన మౌలిక వసతిగా చూడాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు. అయితే తుది నిర్ణయంలో మానవ వివేచన ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు.