Let's talk: editor@tmv.in
ఆర్థిక రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం ‘వేతన’ కానుక

ఆర్థిక రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం ‘వేతన’ కానుక

Shaik Mohammad Shaffee
24 జనవరి, 2026

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆర్థిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు, నాబార్డ్ ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లను సవరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 46,322 మంది ఉద్యోగులకు, 23,570 మంది పెన్షనర్లకు, 23,260 మంది ఫ్యామిలీ పెన్షనర్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగుల సంక్షేమం, వారి సామాజిక భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోందని అధికారులు వెల్లడించారు.

సాధారణ బీమా సిబ్బందికి 14 శాతం పెంపు

సాధారణ బీమా రంగంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి సంస్థల ఉద్యోగులకు ఆగస్టు 1, 2022 నుండి అమలులోకి వచ్చేలా 12.41 శాతం వేతనాలను పెంచారు. ఇందులో భాగంగా ప్రాథమిక వేతనం (బేసిక్ పే), కరువు భత్యం (డీఏ)పై 14 శాతం పెరుగుదల ఉంటుంది. దీనివల్ల దాదాపు 43,247 మంది సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా 2010 తర్వాత చేరిన ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇచ్చే ఎన్పీఎస్ వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచారు. ఇక మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే 'ఫ్యామిలీ పెన్షన్'ను కూడా అందరికీ ఒకేలా 30 శాతానికి పెంచడం విశేషం.

నాబార్డ్ ఉద్యోగులకు 20 శాతం

నాబార్డ్ బ్యాంకులో పనిచేస్తున్న అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ దాదాపు 20 శాతం మేర జీతభత్యాలు పెరగనున్నాయి. ఇది నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుంది. దీనికోసం ప్రభుత్వం బకాయిల రూపంలోనే సుమారు రూ. 510 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే నాబార్డ్‌లో పని చేసి 2017 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి కూడా పెన్షన్లను పెంచారు. దీనివల్ల వందలాది మంది వృద్ధులకు, వారి కుటుంబాలకు ప్రతి నెలా అందే పెన్షన్ డబ్బు పెరుగుతుంది.

ఆర్‌బీఐ పెన్షనర్లకు కూడా..

రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి రిటైర్ అయిన వారికి కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పెన్షన్లను 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పెన్షనర్లకు నెలకు వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మొత్తం మీద ఆర్‌బీఐలో 30,769 మందికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది.

గౌరవప్రదమైన జీవనం కోసమే..

"ఉద్యోగులు, పెన్షనర్ల సామాజిక భద్రత, వారి ఆర్థిక శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయమే నిదర్శనం. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థల సిబ్బందికి, రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే మా లక్ష్యం" అని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.