Let's talk: editor@tmv.in
ఆర్డీటీ పై మాట నిలబెట్టుకున్నాం: మంత్రి సవిత

ఆర్డీటీ పై మాట నిలబెట్టుకున్నాం: మంత్రి సవిత

Panthagani Anusha
30 మార్చి, 2026

అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా పేదలకు అండగా నిలుస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు విదేశీ నిధుల సమీకరణ ( ఎఫ్.సి.ఆర్.ఎ) రెన్యూవల్ అయ్యేలా చేసి తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెస్ రాజు, బంగారు శ్రావణిలతో కలిసి ఆమె మాట్లాడారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విదేశీ నిధుల అనుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పునరుద్ధరించడం శుభపరిణామమని కొనియాడారు.

గత 60 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని మంత్రి కొనియాడారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు ఈ ప్రాంత వెనుకబాటును చూసి చలించి స్థాపించిన ఈ సంస్థ వేలాది మందికి విద్య, వైద్యం, గృహ వసతి కల్పించిందని గుర్తుచేశారు. రైతులకు ఆధునిక పనిముట్లు, భూములు ఇవ్వడమే కాకుండా, క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లను తీర్చిదిద్దిన ఘనత ఈ సంస్థకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా ఆర్డీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గర్భిణులకు, పేద రోగులకు వరప్రసాదంగా మారిందని, అత్యవసర చికిత్స కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోందని ప్రశంసించారు.

ఆర్డీటీకి విదేశీ నిధుల సేకరణలో ఇబ్బందులు తలెత్తిన విషయం తమ దృష్టికి రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్‌కు వివరించినట్లు మంత్రి సవిత తెలిపారు. మంత్రి లోకేష్ తక్షణమే స్పందించి కేంద్ర హోం శాఖతో మాట్లాడారు. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యాలయాలతో సమన్వయం చేసుకుని అనుమతులు వచ్చేలా కృషి చేశారు. ఎనిమిది నెలల క్రితం ఇదే వేదికపై ఇచ్చిన హామీ మేరకు నిధుల అడ్డంకులను తొలగించాం అని ఆమె పేర్కొన్నారు. నిధుల పునరుద్ధరణ కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరం ఫాలోఅప్ చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వైసీపీది క్రెడిట్ చోరీ

ఆర్డీటీకి నిధులు నిలిచిపోయినా గత జగన్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని మంత్రి సవిత విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం శ్రమించి అనుమతులు తీసుకువస్తే, ఆ క్రెడిట్ తమదేనంటూ వైసీపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. క్రెడిట్ చోరీ చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని, ప్రజలకు నిజం తెలుసని ఆమె స్పష్టం చేశారు. పేదలకు మేలు చేసే విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.

ఆర్డీటీ పై మాట నిలబెట్టుకున్నాం: మంత్రి సవిత - Tholi Paluku