
ఆర్డీటీ కోసం మౌనదీక్ష
పేదల కోసం పనిచేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవటం కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ కన్వీనర్ సాకే హరి స్పష్టం చేశారు. ఆర్డీటికి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలని కోరుతూ సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కు అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. 1969 నుంటి ఇప్పటి వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ సేవలు అందిస్తోందని సాకే హరి తెలిపారు. ఆర్డీటీ సేవలను పేదలు మరిచిపోలేరన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడా రంగాల్లో కులమతాలకు అతీతంగా సేవలు అందించిందన్నారు. ప్రతిభావంతులైన గ్రామీణ యువతను క్రీడారంగంలో అశేషంగా ప్రోత్సహించిందని సాకే హరి గుర్తు చేశారు. ఆర్డీటీ నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి సమాంతరంగా విశేష సేవలు అందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు ఆపడం బాధాకరమని సాకే హరి పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెలిపారు.
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతామని ప్రకటించారు. ఇప్పటికే అఖిలపక్ష కమిటీ దశలవారీ ఉద్యమాలకు పిలుపునిచ్చిందని చెప్పారు. అందులో భాగంగా గాంధీ జయంతి రోజున మౌన దీక్ష చేపడతామని సాకే హరి తెలిపారు. అక్టోబర్ 16న నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నారని, ఆయనతో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తామని చెప్పించాల్సిన బాధ్యత వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తీసుకోవాలని సాకే హరి కోరారు.
