Let's talk: editor@tmv.in
ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్!

ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్!

Gaddamidi Naveen
30 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా తన పదవీ కాలాన్ని ముగిస్తున్న సందర్భంగా, ప్రముఖ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అధికారులు పదవీ నుండి విరమణ పొందే సమయంలో గౌరవ విందులు, సన్మానాలతో వీడ్కోలు చెప్పుకుంటే, ఎండీ సజ్జనార్ మాత్రం ప్రజలతో కలిసి మెలిసి ఉండే స్ఫూర్తిదాయకమైన మార్గాన్ని తానే స్వయంగా అనుసరించి చూపించారు. పదవికి చివరి రోజున, ప్రజా రవాణాపై తన ప్రేమను, అనుబంధాన్ని చూపిస్తూ ఆయన టీజీఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు.

లక్డీకాపుల్ టెలీఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు సజ్జనార్ బస్సులో ప్రయాణించారు. బస్సులో ఎక్కిన వెంటనే యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్ ధర చెల్లించి, కండక్టర్ వద్ద నుంచి టికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో సజ్జనార్ ఇతర ప్రయాణికులతో ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.

ప్రయాణం వెనుక సందేశం

ఉన్నత అధికారి అయినప్పటికీ తన పదవీకాలం చివరి క్షణాలను ప్రజల మధ్య గడపాలనుకోవడం సజ్జనార్ ప్రజాసేవా భావనకు నిదర్శనం. ఆయన నాయకత్వంలో టీజీఆర్టీసీ నూతనోత్సాహంతో ముందుకు సాగింది. బస్సులలో యూపీఐ చెల్లింపుల ప్రవేశం, స్మార్ట్ టికెటింగ్, బస్సుల నూతనీకరణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి వంటి అనేక మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టారు.

సజ్జనార్‌కు నూతన బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పునః వ్యవస్థీకరణలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ను నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసే సజ్జనార్, గతంలో షీటీమ్స్ స్థాపన, దిశా ఘటనలో చర్యలు వంటి సంఘటనలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పోలీస్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత నిబద్ధతతో పని చేయనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్! - Tholi Paluku