Let's talk: editor@tmv.in
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం!

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం!

T Venkata Ramana
11 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)పై కాంగ్రెస్ ప్రభుత్వం-బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తీవ్రతరం చెందుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపుతో ప్రారంభమైన ఈ వివాదం బీఆర్ఎస్ 'చలో బస్ భవన్' నిరసనలతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గత 20 నెలల్లో ఐదుసార్లు ఛార్జీలు పెంచిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. మరోవైపు మునుపటి బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని దిగజార్చినట్టు కాంగ్రెస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ, ఆర్థిక రుణాలు, మహిళలకు ఉచిత సేవలు-పురుషులపై భారం వంటి అంశాలు ఈ వివాదానికి కారణాలుగా మారాయి. ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికులు ఈ పెంపును 'అన్యాయమైనది'గా భావిస్తున్నారు.

ప్రైవేటీకరణ కుట్ర

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావు తదితరులు ఆర్టీసీ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్‌కు చేరుకుని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో ఆర్టీసీ ఛార్జీలను ఐదుసార్లు పెంచిందని హరీష్ రావు ఆరోపించారు. "మహిళలకు ఉచిత బస్సు సేవలు (మహాలక్ష్మి) అందిస్తున్నారు కానీ పురుషులపై రెట్టింపు భారం మోపుతున్నారని, ప్రతి ప్రయాణికుడికి నెలకు రూ. 500 అదనపు ఖర్చు అని విమర్శించారు.

ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. "రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్, హైదరాబాద్ బస్ స్టేషన్లను ప్రైవేటీకరణ చేసి రూ.1,500 కోట్ల రుణం పొందారని ఆరోపించారు. మహాలక్ష్మి స్కీమ్ కింద రూ.1,353 కోట్లు పెండింగ్ డ్యూస్ ఉన్నప్పటికీ, మునుపటి ప్రభుత్వం రూ.9,246 కోట్ల గ్రాంట్లు విడుదల చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రత్యారోపణలు

బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఆర్టీసీని దిగజార్చిందని తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నిరసనలపై తీవ్రంగా స్పందించారు. "మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక కొత్త బస్సు కూడా ప్రవేశపెట్టలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మేం వేలాది బస్సులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు అందించాం" అని విమర్శించారు. "మేము బస్ స్టాండ్లను విక్రయించే ప్రభుత్వం కాదు. ప్రజల సేవ, ఉద్యోగుల భద్రత, సంస్థ పురోగతి మీద దృష్టి పెడుతున్నాం" అని ప్రభాకర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సపోర్టర్స్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ను 'హిపాక్రిసీ'గా ఆరోపిస్తున్నారు. "కేసీఆర్ పాలనలో ఆర్టీసీ రుణాలలో మునిగిపోయింది. కార్గో స్కామ్‌లు, అప్పులు, స్ట్రైకులు, ఇప్పుడు వారు ప్రజల కోసం పోరాడుతున్నట్టు నటిస్తున్నారు" అని ధ్వజమెత్తారు. "బీఆర్ఎస్ మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల వచ్చిన రుణాలను తగ్గించడానికి ఇది అవసరం" అని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఎంటువంటి కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఆర్టీసీకి చేసిందేంటని విమర్శిస్తున్నారు. సిబ్బంది అష్టకష్టాలు పడ్డారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సిబ్బంది సమ్మెలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2400 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బస్ స్టేషన్లను ప్రైవేటీకరణ చేయలేదని బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు.

ప్రయాణికులపై ఎంత భారం?

హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో ప్రయాణించే పౌరులపై ఈ అదనపు సెస్సు (సర్ చార్జ్) నేరుగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులపై నెలకు గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. బస్సు సర్వీస్ రకం, ప్రయాణించే స్టేజీల పరిధికి అనుగుణంగా ఈ అదనపు ఛార్జీ (సెస్సు) లను పెరుగుతున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మొదటి 3 స్టేజీల వరకు రూ. 5 పెంచింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 4వ స్టేజీ నుంచి రూ. 10, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ మొదటి స్టేజీ వరకు రూ. 5 వరకు అదనంగా ఛార్జీ వసూలు చేస్తోంది. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో రెండో స్టేజీ నుంచి రూ. 10 అదనంగా వసూలు చేస్తుంది. ఈ ఛార్జీతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు యధావిధిగా ఉన్నాయి.

రోజువారీ ప్రయాణికులపై భారం

రోజూ కనీసం రెండు సార్లు 4వ స్టేజీ దాటి ప్రయాణించే ( డీలక్స్,ఏసీలో 2వ స్టేజీ దాటి ప్రయాణించే) ప్రయాణికులకు నెలకు సుమారుగా రూ. 300 నుండి రూ. 600 అదనపు భారం పడుతుంది. స్వల్ప దూర ప్రయాణికులకు కూడా కనీసం నెలకు రూ. 150 నుండి రూ. 300 వరకు అదనపు భారం పడుతుంది. దీంతో పాటు యథావిధిగా టికెట్ ఛార్జీ చెల్లింస్తున్నారు.

మౌలిక సదుపాయాల సవాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా టీజీఆర్టీసీ నగర ప్రజా రవాణాను క్లీన్ అండ్ గ్రీన్ దిశగా మార్చడానికి సిద్ధమైంది. అయితే దీనికి భారీ స్థాయిలో ఆర్థిక భారం తప్పడం లేదు. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఈ కొత్త బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.

కొత్త డిపోలు

ప్రజా రవాణాను మరింత విస్తరించడానికి కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రానున్న సంవత్సరంలో సుమారు రూ. 392 కోట్లు ఖర్చవుతుందని టీజీఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ భారీ వ్యయాన్ని సంస్థ పూర్తిగా భరించడం కష్టం. అందుకే ప్రభుత్వం, ప్రజల సహకారం కోరుతూ ఈ అదనపు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆర్టీసీ చేసింది.

భారమవుతున్న మహాలక్ష్మి పథకం

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తరువాత దాని ప్రతిపాదనల మొత్తాన్ని ప్రభుత్వం నుంచి సకాలంలో అందుకోవడంలో జాప్యం కారణంగా టీజీ ఆర్టీసీ పై ఇప్పటికే గణనీయమైన ఆర్థిక భారం పడింది. దీనికి సంబంధించిన బకాయిలు కూడా సంస్థకు అదనపు ఆర్థిక సవాలుగా మారాయి.

క్లీన్ అండ్ గ్రీన్ సిటీ

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వల్ల వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా వాహనాల ఉద్గారాలు గణనీయంగా తగ్గి వాయు కాలుష్యం తగ్గుతుంది. కాలుష్యం తగ్గడం ద్వారా నగరవాసులకు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తగ్గి ప్రజల ఆయుర్థాయం మెరుగుపడుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడితే ట్రాఫిక్ సమస్య కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యాల సాధన కోసమే టీజీ ఆర్టీసీ అదనపు ఛార్జీల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 23న ఆమోదం తెలిపింది. ఈ పెంపును ప్రజలు 'పర్యావరణ సెస్సు' గా భావించి సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు ఒకవైపు ప్రయాణికులకు ఆర్థిక భారం అయినప్పటికీ, మరోవైపు కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఇది ఒక అనివార్యమైన అడుగు. నగర భవిష్యత్తును మెరుగుపరిచే ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని టీజీ ఆర్టీసీ కోరుకుంటోంది

మెట్రోనే బెస్టా

ప్రస్తుతం ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో అనేక మంది ప్రయాణికులు మెట్రో బాట పడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీలోనే ప్రయాణం చేశారు. కానీ ఇంచుమించుగా మెట్రో, ఆర్టీసీ ఛార్జీలు అంతే ఉంటుండడంతో అనేక మంది మెట్రో బాట పడుతున్నారు. దీంతో మెట్రో రైలు బిజీ బిజీగా ఉంటోంది. మెట్రో ఆశ్రయించడం వల్ల ట్రాఫిక్ ను కూడా తప్పించుకోవచ్చనే ఆలోచనలతో నగర ప్రజలు మెట్రో బాట పడుతున్నారు.

ప్రజలపై ప్రభావం

ఈ వివాదం ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్‌లోని మధ్యతరగతి ప్రయాణికులు, కార్మికులు ఛార్జీల పెంపును తప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి, కానీ ప్రభుత్వం రోల్‌బ్యాక్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాటల యుద్ధం రానున్న స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం! - Tholi Paluku