Let's talk: editor@tmv.in
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతాం: మాజీ మంత్రి హరీష్ రావు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతాం: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
13 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అసెంబ్లీ వేదికగా గళమెత్తుతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం తనను కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకుల వినతిపత్రం అందుకున్న ఆయన, కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న 'సవతి తల్లి' ప్రేమను ఎండగట్టారు.

ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తనను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారని హరీష్ రావు తన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేసి సంస్థను బలోపేతం చేయాలని కార్మికులు పోరాటం కొనసాగిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం మాత్రం సంస్థను బలహీనపరిచే విధంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని ఆయన ఆరోపించారు. కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వారికి సబ్సిడీలు అందజేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో సుమారు 2000 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా విద్యుత్ బస్సుల పేరుతో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సంస్థ స్వయంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకాల్లో మార్పులు చేయాలని కార్మికులు కోరుతున్నారని తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో సంస్థ - పెండింగ్ బకాయిలు

మహిళల ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న జీరో టికెట్ పథకానికి ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించిన బకాయిలను చెల్లించకుండా ఆర్థిక భారాన్ని సంస్థపైనే మోపడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని అన్నారు.

ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని, 2025 పీఆర్సీ అమలు కూడా జరగకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న పొదుపు మొత్తాలకు గత 23 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయ‌న‌ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్ల సంస్థ కుదేలవుతోందని, తక్షణమే రూ. 2,804 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విలీన ప్రక్రియలో జాప్యం

బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 'అపాయింటెడ్ డే' ప్రకటించకపోవడాన్ని హరీష్ రావు దుర్మార్గంగా అభివర్ణించారు. దీనివల్ల కార్మికులకు పదోన్నతులు, ఉద్యోగ భద్రత వంటి హక్కులు దక్కడం లేదని ధ్వజమెత్తారు. సిబ్బంది కొరత వల్ల కార్మికులపై పని భారం పెరిగి అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వారి హక్కుల పోరాడతామని హరీష్ రావు హామీ ఇచ్చారు.