
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఈయూ విజ్ఞప్తి
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రతినిధులు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఉద్యోగుల ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 28న సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చినా, జీఓ ఇంకా రాకపోవడంతో 6,000 మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ వరకు బకాయిగా ఉన్న రూ.360 కోట్లు తక్షణం చెల్లించాలని కోరారు. స్త్రీ శక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10,000 సిబ్బంది నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు.
పదవీ విరమణ చేసిన వారికి ఆర్.ఇ.యం.యస్ స్కీమ్ అమలు, విధుల్లో ఉన్న ఉద్యోగుల పలు వినతుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత సమస్యలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి , సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య నేతృత్వంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.
