
ఆర్టీసీకి 'మహాలక్ష్మి' పథకం.. నష్టాల నుంచి లాభాల బాటలోకి: డిప్యూటీ సీఎం
ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వల్ల తెలంగాణ ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టడం ఆనందకరమని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మరింత సులభంగా అందించేందుకు ప్రత్యేక కార్డుల పంపిణీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఈ సౌకర్యం అందేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహాలక్ష్మి పథకం
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ బలోపేతం, కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలు 255 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం తెలంగాణ మహిళా సాధికారతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని ఆయన వివరించారు.
రవాణా రంగంలో పర్యావరణహిత చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లను వేగంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ పంపిణీ పూర్తి చేయాలని ఆయన సూచించారు.అలాగే నాయి బ్రాహ్మణ, రజక వృత్తుల సంఘాలకు ఉచిత విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే విద్యా రంగంలో సంస్కరణల భాగంగా 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు గురుకులాల మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. సమానత్వం, సాధికారత, అభ్యున్నతి దిశగా ప్రజా ప్రభుత్వం స్థిరంగా ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
