Let's talk: editor@tmv.in
ఆర్‌టీఐ చట్టాన్ని ఖూనీ చేసేందుకు కేంద్రం కుట్ర: మల్లికార్జున ఖర్గే ధ్వజం

ఆర్‌టీఐ చట్టాన్ని ఖూనీ చేసేందుకు కేంద్రం కుట్ర: మల్లికార్జున ఖర్గే ధ్వజం

Dantu Vijaya Lakshmi Prasanna
31 జనవరి, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సమాచార హక్కు చట్టంపై చేసిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్‌టీఐ చట్టాన్ని పునఃసమీక్షించాలన్న ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం పారదర్శకతను సమాధి చేసి, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన సోషల్ మీడియా 'ఎక్స్’’ వేదికగా విమర్శించారు.

ఆర్థిక సర్వేలో సూచించిన "మినిస్టీరియల్ వీటో" అంశాన్ని ఖర్గే ప్రధానంగా ప్రస్తావించారు. సమాచారాన్ని బయటపెట్టకుండా అడ్డుకునే అధికారం మంత్రులకు కట్టబెట్టడం అంటే, ప్రజల ప్రశ్నించే హక్కును హరించడమేనని ఆయన మండిపడ్డారు. అధికారుల సర్వీస్ రికార్డులు, బదిలీలు, ఇతర వ్యక్తిగత వివరాలను పబ్లిక్ స్క్రూటినీ నుండి తప్పించడం వల్ల బ్యూరోక్రసీలో జవాబుదారీతనం నశిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2014 నుండి మోదీ ప్రభుత్వం ఆర్‌టీఐ చట్టాన్ని క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తోందని ఖర్గే విమర్శించారు. 2019లో చట్ట సవరణల ద్వారా ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పదవీకాలం, వేతనాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని, తద్వారా స్వతంత్ర సంస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం 26,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉండటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

2023లో తెచ్చిన డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని ఖర్గే ఒక "ఆయుధం"గా అభివర్ణించారు. గోప్యత పేరుతో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని నిలిపివేస్తూ, అవినీతిని రక్షిస్తున్నారని ఆరోపించారు. గడచిన 11 ఏళ్లలో ఏడుసార్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవిని ఖాళీగా ఉంచడం ద్వారా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

ఆర్‌టీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ, 2014 నుండి ఇప్పటివరకు 100 మందికి పైగా కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ‘విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, 2014' ను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది నిజాయితీ గల వ్యక్తుల ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

చివరగా, ఉపాధి హామీ పథకాన్నిఇప్పటికే నిర్వీర్యం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఆర్‌టీఐ చట్టాన్ని కూడా అదే దారిలో అంతం చేయాలని చూస్తోందని ఖర్గే హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్‌టీఐ చట్టాన్ని ఖూనీ చేసేందుకు కేంద్రం కుట్ర: మల్లికార్జున ఖర్గే ధ్వజం - Tholi Paluku