
ఆర్జేడీ బీహార్‌ను దశాబ్దాల పాటు వెనక్కి నెట్టింది: ప్రధాని మోడీ
బీహార్‌లో ఆర్జేడీ పాలన అంటే వెనుకబాటుతనం, అంధకారం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. కటిహార్‌లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ ఆర్జేడీ పాలనలో అభివృద్ధి చేయకుండా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రజలు రోడ్లు కావాలని అడిగితే ప్రమాదాలు జరుగుతాయని భయపెట్టేవారు. కరెంటు కావాలని అడిగితే షాక్ తగిలి చనిపోతారు అని చెప్పేవారు. ఇవే ఆర్జేడీ పాలనలో చెప్పిన కబుర్లు. అభివృద్ధికి వ్యతిరేకంగా నడిచిన పార్టీ అది అని మోడీ ఎద్దేవా చేశారు.
నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘సుశాసన్’ (మంచి పాలన) తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. జంగిల్‌రాజ్ కాలంలో నిరాశ, భయం ఉండేది. ఇప్పుడు అభివృద్ధితో కొత్త కలలు, కొత్త ఆశలు వచ్చాయి. వందే భారత్ రైళ్లు, కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆసుపత్రులు ఇవి అన్ని ఎన్డీయే చేసిన కృషి ఫలితాలని ప్రధాని తెలిపారు.
ప్రజలకు ఎన్డీయేపైనే నమ్మకం ఉందని వారే తమ ఆశలను నెరవేర్చగలరని మోడీ పేర్కొన్నారు. రైలు వెళ్లిన ప్రతి చోట వందే భారత్ కావాలంటున్నారు. రోడ్లు వేసిన చోట ఎక్స్‌ప్రెస్‌వేలు కావాలంటున్నారు. చిన్న ఆసుపత్రులు ఉన్న చోట సూపర్ స్పెషాలిటీలు కావాలంటున్నారు అని ఆయన వివరించారు. కటిహార్ నియోజకవర్గం నుంచి కిశోర్ ప్రసాద్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దింపింది. ఈ సీటులో గతంలో కూడా మూడు సార్లు ఆయనే గెలిచారు. అలాగే సహర్సాలో జరిగిన మరో సభలోనూ మోడీ ఆర్జేడీ–కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి నిఘంటువులో ‘జంగిల్‌రాజ్, కట్టా, అవినీతి, చెడు ప్రవర్తన’ వంటి పదాలే ఉంటాయి. పాలన అంటే ఏంటో నేర్చుకోలేదు అని విమర్శించారు. బీహార్‌లోని ప్రజల కంటే ‘చొరబాటుదారులకే’ ఆ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. బీహార్ భవిష్యత్తును మీరు నిర్ణయిస్తారా? లేక చొరబాటుదారులా? వాళ్లు మీ ఆస్తుల మీద, వనరుల మీద హక్కు పొందుతున్నారు. వారిని రక్షించేందుకే కాంగ్రెస్, ఆర్జేడీలు పరిగెడుతున్నాయి. బీహార్‌ను చొరబాటుదారుల నుంచి కాపాడాల్సిన సమయం ఇది అని ప్రధాని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులపై కఠిన చర్యలే లేవు: అమిత్ షా
ఉగ్రవాదంపై కఠిన చర్య తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రతి సారి విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు.సితామర్హిలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పాలనలో దేశం తరచూ ఉగ్రదాడులను ఎదుర్కొందని అన్నారు.
ఆ సమయంలో ప్రతి రెండో రోజులకొసారి ఉగ్రదాడులు జరిగేవి. కానీ కాంగ్రెస్ పాలకులు ఎప్పుడూ కఠిన చర్యలు తీసుకోలేదు. బదులుగా ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించేవారు. మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది అని షా గుర్తు చేశారు.
ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాలను అమిత్ షా ప్రశంసించారు. “ఉరి, పుల్వామా, పహల్గాం ఘటనల తర్వాత మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్‌లు, ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టి ఉగ్రవాదులను వాళ్ల ప్రాంతాలకు తరిమేశాం. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాద శిబిరాలు భూస్థాపితమయ్యాయి. దేశ భద్రతను కాపాడింది, అభివృద్ధి దిశగా తీసుకెళ్లింది మోడీ నాయకత్వమే అని ఆయన అన్నారు.
మోడీని అనుమానించిన అభ్యతరం లేదు.. చఠ్ మయ్యాను అవమానించడమా?
రాహుల్ గాంధీపై కూడా అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చఠ్ మయ్యాను అవమానించడం ఏంటీ? మోడీని ఎన్ని విమర్శించినా మాకు అభ్యంతరం లేదు. కానీ బీహార్ ప్రజల ఆరాధ్యమైన చఠ్ మయ్యాను అవమానించటం ఎప్పటికీ మర్చిపోలేం అని ఆయన హెచ్చరించారు. నక్సలిజం నిర్మూలనలోనూ మోడీ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలు తీసుకుందని షా వివరించారు. కాంగ్రెస్ కాలంలో బీహార్‌లో ఎన్నో జిల్లాలు నక్సలిజం బారిన పడ్డాయి. అప్పుడు మధ్యాహ్నం మూడింటికే ఓటింగ్ ముగిసేది. కానీ ఇప్పుడు మొత్తం బీహార్‌లో సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతోంది. బీహార్ ఇప్పుడు నక్సల్ ఫ్రీ అని హోంమంత్రి పేర్కొన్నారు.
