Let's talk: editor@tmv.in
ఆర్జేడీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్వీ యాదవ్

ఆర్జేడీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్వీ యాదవ్

Pinjari Chand
26 జనవరి, 2026

తేజస్వీ యాదవ్ పై ఆర్జేడీ అధినేత మరో బాధ్యతను మోపారు. పార్టీలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టారు. పార్టీలో మరింత కీ రోల్ పోషించనున్నారు. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్ ప్రెసిడెంట్)గా బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ను నియమిస్తున్నట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం పాట్నాలో జరిగిన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం రబ్రీదేవి, తేజస్వీ యాదవ్, మీసా భారతి సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. నియామకం అనంతరం పార్టీ అధికారికంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ కొత్త యుగానికి నాంది! రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్ జీ నియమితులయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్జేడీ ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడి ఆమోదంతో తేజస్వీ యాదవ్‌ను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలని ప్రతిపాదన పెట్టాం. కార్యవర్గం ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. నేటి నుంచే తేజస్వీ జీ పార్టీ మార్గదర్శకాలు, జాతీయ అధ్యక్షుడి సూచనల ప్రకారం బాధ్యతలు నిర్వర్తిస్తారు అని తెలిపారు. తేజస్వీ బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

భయపడకుండా మాట్లాడండి

ఇదిలా ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ‘లాలూవాద్’ అనేది అణగారిన వర్గాల కోసం సాగే పోరాటమని వ్యాఖ్యానించారు. పార్టీ పునాది స్థాయి కార్యకర్తలు భయపడకుండా మాట్లాడాలని ఆమె పిలుపునిచ్చారు. తేజస్వీ యాదవ్‌ను ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, పార్టీపై ఫాసిస్టు శక్తుల చేత పంపబడిన చొరబాటుదారులు, కుట్రదారులు నియంత్రణ సాధిస్తున్నారు అంటూ ఆమె పరోక్ష విమర్శలు చేశారు. ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యత వహించాల్సిన నేతలు ప్రశ్నలను తప్పించుకుంటున్నారని, ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని ఆరోపించారు. నిజమైన లాలూవాది అయితే పార్టీ ఈ దుస్థితికి కారణమైన వారిని ప్రశ్నిస్తాడు. పరిణామాల గురించి ఆలోచించకుండా, అనుమానాస్పద పాత్రలను బహిర్గతం చేస్తాడని రోహిణి ఆచార్య పేర్కొన్నారు.