
ఆర్‌జేడీ ఎమ్మెల్యేలతో తేజస్వీ యాదవ్ బేటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత ఆర్‌జేడీ భవిష్యత్ పై చర్చించేందుకు పార్టీ నేత తేజస్వీ యాదవ్ సోమవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో మహాఘట్బంధన్ కూటమి దారుణ పరాజయం, కొత్తగా ఏర్పడే ఎన్‌డీఏ ప్రభుత్వానంతరం ఏ విధంగా ప్రభుత్వం పై పోరాడాలి, తదితర పార్టీకి సంబంధించి విధానాలు చర్చకు వస్తాయన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో ఎన్‌డీఏ 202 సీట్లు గెలిచి భారీ విజయం సాధించింది. ఆర్‌జేడీ పోటీ చేసిన 143లో కేవలం 25 సీట్ల దగ్గరే నిలిచిపోయింది.
లాలూ ఇంట్లో కలహాలు
ఎన్నికల షాక్‌తో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీకి మరో దెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ నివాసంలో కుటుంబ వివాదాలు పెచ్చుమీరుతున్నాయి. లాలూకు కిడ్నీ దానం చేసి పార్టీ టికెట్ ఆశించిందనే విషయంపై తనపై నిందలు మోపారంటూ, కుమార్తె రోహిణి ఆచార్య ఆదివారం తీవ్రంగా స్పందించారు. ‘డబ్బు, టికెట్ కోసం ‘మురికి కిడ్నీ’ ఇచ్చాను అని చెప్పి నన్ను హేళన చేశారు. నన్ను అనాథను చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు ఉన్నింట్లో తండ్రిని రక్షించడానికి కూతుళ్లు ముందుకు రావొద్దు అని ఆవేదనగా చెప్పింది. నాలాంటి దురదృష్టం గల కుమార్తె ఎవరికీ పుట్టకూడదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవన్నీ ఆమె పార్టీకి రాజీనామా చేసి, కుటుంబాన్ని విడిచిపెడుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు జరిగాయి. అలాగే ఆర్‌జేడీ ఓటమికి కారణం తేజస్వీకి అత్యంత దగ్గరివారైనా సంజయ్ యాదవ్ (హర్యానా), రమీజ్ (యూపీ రాజకీయ కుటుంబం) అని కూడా ఆరోపించారు. రోహిణి పార్టీ విడిచిన మరుసటి రోజు, లాలూ ఇతర ముగ్గురు కుమార్తెలైన రాజ్‌లక్ష్మి, రాగిని, చందా పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరిలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.
ఎన్‌డీఏ నాయకుల విమర్శలు
రోహిణి వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్‌డీఏ నేతలు తేజస్వీపై దుమ్మెత్తిపోశారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుశ్వాహా మాట్లాడుతూ ఇది కుటుంబ వ్యవహారమైతేనూ, కుటుంబ మహిళల గౌరవం కాపాడుకోలేని వారు బీహార్ పరిపాలన చేస్తారా? అనే ప్రశ్న ప్రజల ముందుందన్నారు.
ఇటీవలి కాలంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ భార్య ఐశ్వర్య రాయ్ కూడా కుటుంబంపై ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లాలూ కుమార్తె వీధిలోకి వచ్చి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టం. లాలూ లేదా రోహిణిని ఎవరైనా అవమానిస్తే ప్రజలు కూడా సహించరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అన్నారు. ఇవాళ తేజస్వీకి పేరు వచ్చింది అంటే అది లాలూ–రబ్రీ దేవిల వల్లనే అని పేర్కొన్నారు.
లాలూ, రబ్రీ ఇంట్టో నిశ్శబ్దం
ఎన్నికల ఫలితాలతో ఎన్‌డీఏలో ఉత్సాహం ఉరకలేస్తుండగా మాజీ సీఎంలు లాలూ–రబ్రీ నివాసం మాత్రం నిశ్శబ్దంగా, ఎలాంటి రాజకీయ సందడి లేకుండా కనిపించింది. సాధారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే వారి ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా కనబడలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్‌జేడీ విధానసభాపక్ష నేతగా తేజస్వీ ఎంపిక
తాజాగా ఎన్నికైన ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై పార్టీకి చెందిన తేజస్వీ యాదవ్‌ను విధానసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పార్టీ ప్రతినిధి శక్తి సింగ్ తెలిపిన ప్రకారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నిర్ణయంతో తేజస్వీ యాదవ్ ఆర్‌జేడీ విధానసభాపక్ష నేతగా ఎంపికయ్యారన్నారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, మాజీ సీఎం రబ్రీ దేవి, ఎంపీ మీసా భారతి, సీనియర్ నేత జగదానంద్ సింగ్ హాజరయ్యారు. తేజస్వీ యాదవ్, గతంలోనూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో మహాఘట్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే.
