
ఆర్ఎస్ఎస్ లో ఏ మతానికి చెందిన వారైనా రావొచ్చు
ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఏ వర్గానికి చెందిన వారైనా ఆర్ఎస్ఎస్ లోకి రావచ్చు. కానీ తమ మతపరమైన భిన్నత్వాన్ని బయట వదిలిపెట్టి భారతమాత పుత్రులమనే భావనతో రావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన ‘100 ఏళ్ల సంఘ ప్రయాణం – కొత్త దిశలు’ అనే రెండు రోజుల ఉపన్యాసంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. సంఘం కులం, మతం అనే విభజనలను గుర్తించదు. ఎవరైనా రావొచ్చు. మేం ఎవరి లెక్కనూ తీసుకోం, ఎవరిని అడగం. మేమంతా భారతమాత సంతానమే అని ఆయన వివరించారు. సంఘంలో బ్రాహ్మణుడు, ఇతర కులం, ముస్లిం, క్రైస్తవుడు ఎవ్వరికీ ప్రత్యేకంగా చోటు ఉండదు. అందరూ హిందూ సమాజంలోనే భాగంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా రావచ్చు. కానీ తమ మతపరమైన ప్రత్యేకతను లోపలికి తీసుకురావద్దు అని చెప్పారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా ఎటువంటి పాఠశాలలు ఏర్పాటు చేయం అని స్పష్టం చేశారు.
సంఘం చట్టబద్ధమే: భగవత్
భగవత్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేయించాలా? వారికి వ్యతిరేకంగా. ఆ సమయంలో సర్ సంఘ్ చాలక్ లు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం అడగలేదు. ఇప్పటికే మూడు సార్లు సంఘంపై నిషేధం విధించారు. ఆ నిషేధాలను కోర్టులు రద్దు చేశాయి. అంటే ప్రభుత్వం కూడా సంఘం ఉన్నదని అంగీకరించింది. రాజ్యాంగపరంగా చట్టబద్ధమైన సంస్థ. కోర్టు కూడా ఇదే చెప్పింది. రిజిస్ట్రేషన్ లేకపోయినా ఇది చట్టవిరుద్ధం కాదు అన్నారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదు. కానీ అది ఉన్నదే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ కమ్ ట్యాక్స్ కూడా ఆర్ఎస్ఎస్ ను వ్యక్తుల సంఘంగా గుర్తించింది. అందుకే పన్నుల నుంచి మినహాయింపునిచ్చిందన్నారు. చాలా సార్లు అసెంబ్లీ, పార్లమెంట్ లో కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. మేం హిందూ సమాజాన్ని ఏకతా, శక్తి, గుణాలతో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. బలమైన భారత్ ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించాలనేది మా దృష్టి.
సంఘం ఎప్పటి నుంచో త్రివర్ణ పతాకానికి గౌరవం ఇస్తూనే ఉంది. ఒకప్పుడు భగవత్ ధ్వజాన్ని జాతీయ పతాకంగా ప్రతిపాదించాం. కానీ ఇప్పుడు త్రివర్ణ పతాకానికి మేం గౌరవిస్తాం. భగవద్ వర్సెస్ తిరంగా అనే ప్రశ్నే ఉండదు అని స్పష్టం చేశారు. ఒకవేళ వస్తే త్రివర్ణ పతాకాన్నే మేం ఎన్నుకుంటామన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (ఆర్.ఎస్.ఎస్) స్థాపనకు ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు, చర్చలు, సదస్సులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు మత సామరస్యంపై మరోసారి చర్చకు దారితీశాయి. అలాగే ఎవరైనా సంఘంలో చేరొచ్చు అని తెలిపారు. ట్రాన్స్ జెండర్లు కూడా ఇందులో చేరొచ్చు అని తెలిపారు. అలాగే ఏఐ, జెన్ జీ లపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలిచ్చారు.
