
ఆర్ఎస్ఎస్‌ను ప్రజలు అంగీకరించారు: దత్తాత్రేయ హోసబలే
కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ సంస్థను నిషేధించాలన్న డిమాండ్‌పై ఆ సంస్థ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే తీవ్రంగా స్పందించారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సంస్థను ఎందుకు నిషేధించాలి? ఆర్ఎస్ఎస్‌ను ప్రజలు ఇప్పటికే అంగీకరించారు అని ఆయన స్పష్టం చేశారు. శనివారం జబల్పూర్‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశం రెండో రోజు మీడియాతో మాట్లాడిన ఆయన నిషేధం వెనుక కారణం ఉండాలని, కేవలం రాజకీయ దృష్టితో నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కచ్చనార్ నగరంలో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ స్థాపన, శతాబ్ది ఉత్సవాలు, జాతీయ అంశాలపై ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో దేశంలో న్యాయవ్యవస్థ దెబ్బతినడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాధ్యత వహించాలి. నిజంగా ప్రధాని మోడీకి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆలోచనలపై గౌరవం ఉంటే ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించాలి అని హితవు పలికారు. తన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
1925లో కేశవ్ బాలీరాం హెడ్గేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే మహాత్మా గాంధీ హత్య అనంతరం 1948లో సంస్థపై తాత్కాలిక నిషేధం విధించగా, తరువాత దర్యాప్తులో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేలడంతో ఆ నిషేధం ఎత్తివేశారు. 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశాడు. గాడ్సే గతంలో ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నది నిజం. అయితే, అప్పటికి అతను ఆ సంస్థ నుండి దూరమై హిందూ మహాసభ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. గాంధీ హత్య తర్వాత ప్రజల ఆగ్రహంతో, ప్రభుత్వం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించింది. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోం మినిస్టర్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తర్వాత జస్టిస్ కపూర్ కమిషన్, అలాగే ఇతర విచారణలలో గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం ఉన్నట్లు ఆధారాలు లేవు అని తేల్చారు.
