Let's talk: editor@tmv.in
ఆర్ఆర్ఆర్‌, గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి: గడ్కరీని కోరిన సీఎం రేవంత్

ఆర్ఆర్ఆర్‌, గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి: గడ్కరీని కోరిన సీఎం రేవంత్

Gaddamidi Naveen
15 జులై, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో మంగళవారం ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు కీలక రహదారుల ప్రాజెక్టులు, ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) అనుమతులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని కేంద్ర మంత్రికి వివరించారు. పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలు రెండింటి పనులను ఏకకాలంలో ప్రారంభిస్తే నిర్మాణం త్వరగా పూర్తి కావడమే కాకుండా, నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టుకు 12 వరుసల రహదారిని మంజూరు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల హైదరాబాద్ - విజయవాడల మధ్య దూరం దాదాపు 100 కిలోమీటర్లు తగ్గుతుందని, బందరు పోర్టుకు సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందని వివరించారు.

నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాల మీదుగా సాగే మన్ననూరు - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. అలాగే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మరో ఆరు వరుసల కొత్త రహదారికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని, ఇది వ్యవసాయ, వ్యాపార రంగాలలో నూతన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RevanthReddyNitinGadkariRegionalRingRoadRRRTelanganaHyderabadInfrastructureRoadDevelopmentNationalHighwaysGreenfieldHighwayFutureCity
ఆర్ఆర్ఆర్‌, గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి: గడ్కరీని కోరిన సీఎం రేవంత్ - Tholi Paluku