Let's talk: editor@tmv.in
ఆరో రోజూ భీకర పోరు

ఆరో రోజూ భీకర పోరు

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరో రోజుకు చేరాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా సాగిస్తున్న దాడులు గురువారం నాటికి భీకర స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆ దేశంలో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఉత్తర టెహ్రాన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక నిఘా కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పులు కురిపిస్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ను ఉధృతం చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

వారసుడి ఎంపికపై నీలినీడలు

ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు మోజ్తబాను వారసుడిగా ప్రకటించాలని ఇరాన్ యోచించినప్పటికీ, నిరంతర బాంబు దాడుల నేపథ్యంలో ఆ ప్రక్రియ వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ సంతాప దినాలను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. ఒకవేళ సంతాప సభలు నిర్వహిస్తే అక్కడకు వచ్చే ప్రముఖులను కూడా శత్రువులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ మాత్రం.. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా, వారు శత్రుత్వ ధోరణి వీడకుంటే తమ తదుపరి లక్ష్యం వారేనని బహిరంగంగానే హెచ్చరిస్తోంది.

యుద్ధనౌక మునకతో ముదురుతున్న వివాదం

హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా'ను అమెరికా జలాంతర్గామి టార్పెడోలతో ముంచివేసింది. ఈ ఘటనలో 87 మంది నావికులు మరణించగా, 32 మందిని రక్షించారు. తమ భూభాగానికి వేల మైళ్ల దూరంలో ఉన్న నౌకపై దాడి చేయడాన్ని అమానుషంగా ఇరాన్ అభివర్ణించింది. దీనికి అమెరికా 'ఘోరమైన మూల్యం' చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘచీ హెచ్చరించారు. ప్రతిచర్యగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఒక అమెరికా చమురు ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేసి నిప్పుపెట్టారు.

అజర్బైజాన్‌పై డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇరుగుపొరుగు దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది. ఇరాన్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లు తమ దేశంలోని నఖ్చివాన్ అటానమస్ రిపబ్లిక్‌పై దాడులు చేశాయని అజర్బైజాన్ తీవ్రంగా ఖండించింది. ఒక డ్రోన్ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ఢీకొట్టగా, మరొకటి శకరాబాద్‌లోని ఒక పాఠశాల సమీపంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడటంతో అజర్బైజాన్ ప్రభుత్వం ఇరాన్ రాయబారి మొజ్తబా డెమిర్చిలౌకు సమన్లు జారీ చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

100 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ ప్రతాపం

మరోవైపు ఇరాన్ అమ్ములపొదిలోని క్షిపణి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వాయుసేన గురువారం భీకర దాడులు చేపట్టింది. ఏకకాలంలో 100 యుద్ధ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లి, ఇరాన్ సైనిక కేంద్రాలపై 250కి పైగా భారీ బాంబులను జారవిడిచాయి. ప్రధానంగా ఇరాన్ గర్వకారణంగా భావించే 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్' ప్రధాన కార్యాలయం, నిఘా విభాగం సైబర్ యూనిట్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.

క్షిపణి లాంచర్లు ధ్వంసం.. గగనతల ఆధిపత్యం

ఇరాన్‌లోని ఇస్ఫహాన్, కామ్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైపు గురిపెట్టి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న బాలిస్టిక్ క్షిపణి లాంచర్‌ను కామ్ ప్రాంతంలో ధ్వంసం చేశారు. అలాగే ఇస్ఫహాన్‌లో అధునాతన 'ఘదర్' క్షిపణులను నిల్వ ఉంచిన రెండు కేంద్రాలను నేలమట్టం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ ఏర్పాటు చేసిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది.

‘హైపర్ సోనిక్’ పంజా

ఇరాన్ సైన్యం కూడా ఏమాత్రం తగ్గకుండా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’లో భాగంగా 17వ విడత దాడులను చేపట్టింది. ఈసారి అత్యంత వేగవంతమైన 'హైపర్ సోనిక్' క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను ప్రయోగించి ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదించింది. అమెరికాకు చెందిన 'థాడ్' క్షిపణి నిరోధక వ్యవస్థను తమ క్షిపణులు అధిగమించాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనంతో పాటు బెన్ గురియన్ విమానాశ్రయంపై క్షిపణులు పడటంతో అక్కడ సైరన్లు మారుమోగాయి.

ఇరాన్‌లో భారీగా ప్రాణనష్టం!

యుద్ధం మొదలైన ఆరు రోజుల్లోనే ఇరాన్‌లో ప్రాణనష్టం భారీగా పెరిగింది. ఈ పోరులో ఇప్పటివరకు కనీసం 1,230 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం ధృవీకరించింది. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. హిజ్బుల్లా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపుల నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగుతున్నాయి. ఉత్తర లెబనాన్‌లోని శరణార్థి శిబిరాలపై కూడా దాడులు జరగడం ఉద్రిక్తతను పెంచుతోంది.

విస్తరిస్తున్న యుద్ధం.. పొరుగు దేశాల అప్రమత్తత

ఈ పోరు కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యే కాకుండా పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. తమ భూభాగంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని అజర్బైజాన్ ఆరోపించగా, ఖతార్‌ రాజధాని దోహాలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నాయి. అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో దాడుల భయంతో ఖతార్ తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సౌదీ, యూఏఈలు కూడా తమ సరిహద్దుల్లోకి వస్తున్న క్షిపణులను అడ్డుకుంటున్నట్లు ప్రకటించాయి.

చమురు సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ

ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారింది. ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. ఓమన్ తీరంలో 'ఎంవీ సఫీన్ ప్రెస్టీజ్' అనే నౌకపై క్షిపణి దాడి జరగడంతో అందులో మంటలు చెలరేగాయి. రవాణా మార్గాల్లో అంతరాయం కలగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్‌తో జైశంకర్ చర్చలు

భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గురువారం ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘచీతో ఫోన్లో మాట్లాడారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న కోటి మంది భారతీయుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిణామాలను చూస్తూ ఊరుకోలేమని, తక్షణమే దాడులు ఆపి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చమురు సరఫరాకు ఆటంకం కలిగితే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని భారత్ స్పష్టం చేసింది.

దౌత్యమే మార్గమన్న బీజింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తమ ప్రత్యేక రాయబారి జాయ్ జున్‌ను త్వరలోనే ఈ ప్రాంతానికి పంపనున్నట్లు చైనా ప్రకటించింది. యుద్ధం, బలప్రయోగం పరిష్కారం కావని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇప్పటికే రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్‌తో సహా పలు దేశాల మంత్రులతో మాట్లాడారు.

స్వదేశీ బాటలో వేలాది మంది.. ప్రత్యేక విమానాలు సిద్ధం

యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన విదేశీయులను తరలించేందుకు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సుమారు 23,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ దేశాలు తమ పౌరుల కోసం ప్రత్యేక సైనిక విమానాలను ఏర్పాటు చేశాయి. అమెరికా ఇప్పటికే 18,000 మందిని స్వదేశానికి చేర్చింది. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమెరికా సెనెట్‌లో ట్రంప్‌‌నకే మద్దతు

అమెరికాలో యుద్ధాన్ని ఆపాలంటూ విపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ‘వార్ పవర్స్ రెజల్యూషన్’ సెనెట్‌లో వీగిపోయింది. 47-53 ఓట్ల తేడాతో ఈ తీర్మానం వీగిపోవడంతో ట్రంప్ పాలకవర్గానికి పెద్ద ఊరట లభించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఈ యుద్ధం మరో 8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని, నావికా దళాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు పోరు ఆపబోమని రిపబ్లికన్లు స్పష్టం చేశారు.

శ్రీలంక తీరంలో రెండో నౌక కలకలం

శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయిన మరుసటి రోజే, రెండో ఇరాన్ నౌక శ్రీలంక సముద్ర సరిహద్దుల్లో కనిపించడం కలకలం రేపింది. ఈ నౌక కూడా ఆపదలో ఉన్నామని, తమకు రక్షణ కావాలని శ్రీలంక నౌకాదళాన్ని కోరినట్లు సమాచారం.

భారతీయులకు 24x7 హెల్ప్‌లైన్

యుద్ధం నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న భారతీయుల కోసం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను (800-46342) ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు నిలిచిపోయినందున భారతీయులు ప్రశాంతంగా ఉండాలని, కేవలం అధికారిక సమాచారాన్నే నమ్మాలని కోరింది. వీసా గడువు ముగిసిన వారికి జరిమానా మినహాయింపునిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాసులకు ఊరటనిస్తోంది.