Let's talk: editor@tmv.in
ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించాలి

ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించాలి

Pinjari Chand
7 అక్టోబర్, 2025

దగ్గుమందు తాగడం వలన చింద్వారాలో 14 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర శుక్లాను కేబినేట్ నుంచి తొలగించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ డిమాండ్ చేశారు. దగ్గు సిరప్ తాగి ప్రాణాలు కోల్పోయిన పిల్లల కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో మొదటి బిడ్డ చనిపోయినప్పుడు మా ఎమ్మెల్యే దర్యాప్తు చేయాలని లేఖ రాశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇంతమంది చిన్నారులు మరణించారని వాపోయారు. అప్పుడే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉంటే ఇంత విషాదం జరిగేదికాదని తెలిపారు. ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత సీఎం ఇక్కడకు వస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించాలని మేం ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అలాగే బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

మంత్రిని ఎందుకు బాధ్యుడిని చేయడం లేదు

‘దగ్గు సిరప్ తాగి 14 మంది చిన్నారులు చనిపోతే మంత్రిని ఎందుకు బాధ్యుడిని చేయడం లేదు. ఇప్పుడు కంపెనీని నిషేదించారు. అలాగే ప్రిస్కిప్షన్​ రాసిన డాక్టర్ పై కేసు పెట్టారు. ఆ డాక్టర్ చేసిన తప్పేంటి. వేలాది మంది వైద్యులు ప్రిస్కిప్షన్​ రాస్తారు. కంపెనీయే ఆ మందును తయారు చేస్తుంది. ప్రభుత్వం ఆ కంపెనీ మందులను పరిశీలించడానికి ఓ డ్రగ్​ కంట్రోలర్ ను నియమిస్తుంది. మరి డ్రగ్ కంట్రోలర్​ ను జవాబుదారీగా ఎందుకు చేయలేదు’ అని మధ్యప్రదేశ్​ ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘార్​ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం మోహన్​ యాదవ్, ఆరోగ్య మంత్రి శుక్లాపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగారూ మధ్యప్రదేశ్ స్మశానంగా మారకముందే మీరు మేలుకోవాలి.ముఖ్యమంత్రి వెంటనే ఆరోగ్యశాఖ మంత్రిని పిలిపించి వివరాలు రాబట్టాలి. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే న్యాయ విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. అయితే ఈ సంఘటనలో 14 మంది పిల్లలు మరణించారు. 8 పిల్లలు చికిత్స పొందుతున్నారు.

ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించాలి - Tholi Paluku