
ఆరోగ్య మాయ: భారత వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న "హెల్త్" ఉత్పత్తుల మోసం
భారతీయ సూపర్‌మార్కెట్లలో నడుస్తే, మన కళ్ల ముందు “హెల్త్ డ్రింక్స్”, “ఇమ్యూనిటీ బూస్టర్స్”, “ఎనర్జీ వాటర్స్”, “ప్రొబయోటిక్ కర్డ్స్” అనే పేర్లతో మెరిసే వందల ఉత్పత్తులు కనిపిస్తాయి. వాటి ప్యాకెట్లపై ORS, ఎలెక్ట్రోలైట్, ప్రొబయోటిక్, విటమిన్ ఫోర్టిఫైడ్ వంటి వైద్యపదాలు, తెల్ల కోటు వేసుకున్న మోడళ్ల ఫోటోలు, ఆరోగ్య చిహ్నాల ముద్రలు కనిపిస్తాయి.కానీ వాటి వెనుక ఉన్న నిజం అవి ఆరోగ్య ఉత్పత్తులు కాకుండా చక్కెరతో నిండిన పానీయాలు అన్నదే.ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తీసుకున్న కీలక నిర్ణయం ఎటువంటి పానీయం లేదా బ్రాండ్ కూడా తన పేరులో “ORS” అనే పదం వాడకూడదని ఈ మోసపు మార్కెటింగ్‌పై పెద్ద దెబ్బ.అది ఒక్క నియమం కాదు, అది ఆరోగ్యాన్ని అమ్మకానికి పెట్టే మార్కెటింగ్ మాయకు మొదటి ప్రతిఘటన.
మోసపూరిత మార్కెటింగ్ ఎలా పనిచేస్తుంది?
ఈ మార్కెటింగ్ రహస్యం చాలా సులభం వైద్య విశ్వసనీయతను అద్దెకు తీసుకుని, వాస్తవానికి చక్కెర లేదా రసాయనాలతో నిండిన ఉత్పత్తిని “హెల్త్” పేరుతో విక్రయిస్తారు. సాధారణ వినియోగదారుడు లేబుల్‌పై చిన్న అక్షరాల్లో ఉన్న పదార్థాలను చదవడు. “ORS యాక్టివ్”, “ఇమ్యూనిటీ ప్లస్”, “ఫోర్టిఫైడ్ ఎనర్జీ” వంటి పదాలు కనిపిస్తే చాలు ఆరోగ్యమైనదే అని నమ్ముతాడు.
కంపెనీలు దీన్ని అద్భుతంగా ఉపయోగిస్తాయి:
• వైద్య పదజాలం (Electrolyte, Hydration, Probiotic)
• వైద్య లుక్ (స్టెతస్కోప్, మాలిక్యూల్ డయాగ్రామ్స్)
• సెలబ్రిటీలు (క్రీడాకారులు, నటులు)
• శాస్త్రీయంగా కనిపించే వాక్యాలు (“2X ఇమ్యూనిటీ పవర్”)
ఈ ప్రకటనలు సాధారణంగా చట్టవిరుద్ధం కావు, ఎందుకంటే అవి “రోగాన్ని నయం చేస్తుంది” అని చెప్పవు “ఆరోగ్యాన్ని బలపరుస్తుంది” అని మాత్రమే చెబుతాయి. అదే చట్టం లోని లొసుగు
ORS వివాదం: వైద్య పదం వ్యాపార బ్రాండుగా మారినప్పుడు
2025 అక్టోబరులో FSSAI తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇకపై ఎటువంటి పానీయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ధేశించిన ఎలక్ట్రోలైట్ ప్రమాణాలను పూర్తిగా పాటించకపోతే “ORS” అనే పదాన్ని వాడకూడదు.చాలా కంపెనీలు ఫ్రూట్-ఫ్లేవర్, అధిక చక్కెరతో కూడిన డ్రింక్స్‌ను “ORS” పేరుతో అమ్ముతూ వచ్చాయి. వాటిలో 100 మిల్లీలీటర్లకు 8–12 గ్రాముల చక్కెర ఉండగా, WHO ప్రామాణిక ORSలో అది కేవలం 1.35 గ్రాములు మాత్రమే ఉండాలి
ఈ తేడా వైద్యపరంగా ప్రమాదకరం. పిల్లలు, వృద్ధులు నిజమైన ORS బదులుగా ఈ తీపి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ మరింత పెరిగిందని అనేక వైద్యులు గుర్తించారు.
ఈ సమస్యను మొదటగా బహిరంగం చేసినది హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డా. శివరంజని సంతోష్. ఆమె సొంత సోషల్ మీడియా ప్రచారం తర్వాత, వినియోగదారుల ఒత్తిడి పెరగడంతో, చివరికి FSSAI నిషేధ ఆదేశం జారీ చేసింది.ఆ ఆదేశంలో స్పష్టంగా పేర్కొంది “ORS పదం ఉపయోగించడం వినియోగదారులను తప్పుదారి పట్టించే, మోసపూరిత లేబెలింగ్ చర్య.”ఇది భారత ఆహార నియంత్రణ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు.
ఇది కొత్తదేనా? భారత మార్కెట్లో పాత మోసాల చరిత్ర
ORS వివాదం అనేది చివరి ఘటన మాత్రమే. ఇంతకు ముందు కూడా అనేక బ్రాండ్లు “ఆరోగ్యం” పేరిట మోసం చేసిన చరిత్ర ఉంది.
1. బోర్న్ విటా వివాదం (2023)
రేవంత్ హిమత్సింగ్కా అనే వ్యక్తి విడుదల చేసిన వీడియో ద్వారా Cadbury Bournvitaలో సగం చక్కెర ఉందని బయటపడింది. “ఇమ్యూనిటీ బూస్టర్” అని అమ్మే ఈ డ్రింక్‌లో WHO సిఫార్సు కంటే ఎక్కువ చక్కెర ఉంది.కంపెనీ లీగల్ నోటీసులు పంపినా, ప్రజా ఒత్తిడి కారణంగా CCPA (Central Consumer Protection Authority) జోక్యం చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. తరువాత ASCI ఆదేశంతో “Health Drink” అనే పదం వాడడాన్ని నిషేధించింది, ఎందుకంటే ఆహార చట్టాల్లో అటువంటి కేటగరీ లేదనే విషయం స్పష్టమైంది.
2. ఫ్రూట్ జ్యూస్ అనే పేరు పెట్టిన చక్కెర నీళ్లు
Maaza, Slice, Frooti వంటి బ్రాండ్లు చాలాకాలం “జ్యూస్” అని అమ్మాయి. కానీ వాటిలో పండ్ల రసం 20% కంటే తక్కువ. 2017లో FSSAI ఆ పదాన్ని “Fruit Drink”గా మార్చాలని ఆదేశించింది.
3. హార్లిక్స్ హైట్ క్లెయిమ్ కేసు
“పిల్లలు పొడవుగా పెరుగుతారు” అని చెప్పిన Horlicks Growth+ ప్రకటన 2018లో ASCI చేత తప్పుదారిపట్టించేదిగా తేలింది.
4. ఎనర్జీ డ్రింక్స్ మాయ
Glucon-D, Electra వంటి ఉత్పత్తులు “ఇన్‌స్టంట్ ఎనర్జీ” పేరుతో అమ్ముతాయి. కానీ అవి కూడా అధిక చక్కెర, రసాయనాలతో నిండిన పౌడర్లు.
5. ప్రోటీన్ పౌడర్ల మోసం
2020–24 మధ్య ఆన్‌లైన్‌లో అమ్మే 60% ప్రోటీన్ పౌడర్లు తప్పు లేబెలింగ్ లేదా స్టెరాయిడ్లు కలిగి ఉన్నాయని ఉన్నట్లు గుర్తించారు.
6. ఆయుర్వేద అద్భుత ఔషధాల మిరాజ్
“మధుమేహం నయం”, “జుట్టు తిరిగి పెరుగుతుంది” వంటి వాదనలతో అనేక “హెర్బల్” ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఆధారాలు లేవు, పరీక్షలు లేవు
ఎందుకు ఈ మోసం ఆగట్లేదు?
• చట్టాల మధ్య సమన్వయ లోపం: FSSAI ఆహారాన్ని, AYUSH ఆయుర్వేదాన్ని, Drug Controller మందులను నియంత్రిస్తారు. కానీ ఈ “హెల్త్ ప్రొడక్ట్స్” మధ్యలో ఉంటాయి అందుకే బాధ్యత ఎవరిదో స్పష్టత లేదు.
• ఎక్కువసార్లు మోసం జరిగిన తర్వాత మాత్రమే చట్ట సంస్థలు ప్రతిస్పందిస్తాయి
• చట్టం లోని లొసుగులు: “Supports immunity” వంటి వాక్యాలు స్పష్టమైన వైద్య క్లెయిమ్స్ కావు కాబట్టి చట్టపరంగా తప్పించుకోవచ్చు.
• సెలబ్రిటీ ప్రభావం: క్రీడాకారులు లేదా నటులు చేసిన ప్రకటనలు ప్రజలను సులభంగా నమ్మించేస్తాయి.
• వినియోగదారుల అవగాహన లోపం: చాలా మందికి లేబెల్ చదవడం, పోషక విలువలను అర్థం చేసుకోవడం తెలియదు.
ఇంకా నిషేధించని కానీ మోసపూరిత ఉత్పత్తులు
• “డిటాక్స్ టీలు” మరియు “ఫ్యాట్ బర్న్” పౌడర్లు
• “మెమరీ బూస్ట్”, “బ్రెయిన్ ఎనర్జీ” డ్రింక్స్
• “ఆక్సిజన్ వాటర్”, “అయానైజ్డ్ వాటర్”
• “నేచురల్” అని చెప్పుకుంటూ కృత్రిమ స్వీటెనర్ ఉన్న పానీయాలు
• “ప్రొబయోటిక్ దహీ” అనే లేబుల్ ఉన్న ఉత్పత్తులు
• “ఇమ్యూనిటీ బూస్టర్” అని పిలువబడే హెర్బల్ సిరప్స్
ఫలితాలు: ఆరోగ్యానికి ప్రమాదం, నమ్మకానికి నష్టం
ఈ మోసాల వల్ల:
• అధిక చక్కెర, అనారోగ్య పదార్థాలతో ప్రజారోగ్యంపై దెబ్బ
• ప్రజలు “హెల్త్” పేరుతో ఎక్కువ డబ్బు నష్ట పోతున్నారు
• నిజమైన ఆరోగ్య ఉత్పత్తులపై కూడా అనుమానం పెరుగుతోంది
ఏమి చేయాలి?
• కఠిన లేబెలింగ్ అమలు: చక్కెర, ఉప్పు, క్యాలరీ వివరాలను QR కోడ్ ద్వారా సులభంగా చూపాలి.
• ఒకే నియంత్రణ వ్యవస్థ: FSSAI, AYUSH, Drug Controller కలిసి పర్యవేక్షించాలి.
• శాస్త్రీయ ధృవీకరణ తప్పనిసరి: ప్రతి ఆరోగ్య క్లెయిమ్‌కు స్వతంత్ర పరిశీలన అవసరం.
• తప్పు ప్రకటనలు చేసిన కంపెనీలకు తీవ్ర శిక్షలు
• ఆహార అవగాహన విద్య: పాఠశాలల్లో లేబెల్ చదవడం నేర్పాలి.
• ఇన్‌ఫ్లూయెన్సర్ నియంత్రణ: ఆరోగ్య ఉత్పత్తుల ప్రకటనల్లో తప్పుడు క్లెయిమ్స్ చేసినవారిపై చట్టపరమైన చర్య.
• నిజమైన పరిశోధన ఆధారంగా ఉన్న ఉత్పత్తులకు ప్రత్యేక “హెల్త్ ట్రస్ట్ సర్టిఫికేట్”.
ప్రపంచం నేర్పిన పాఠాలు
• యునైటెడ్ కింగ్‌డమ్: పిల్లల కోసం చక్కెర అధిక ఆహార ప్రకటనలను నిషేధించింది.
• అమెరికా: “Supports immunity” వంటి వాక్యాలకు FDA డిస్క్లైమర్ తప్పనిసరి.
• ఆస్ట్రేలియా: Nutrient Profile Model ఆధారంగా క్లెయిమ్‌లను నియంత్రిస్తోంది.
భారతదేశం కూడా ఇలాంటి నమూనాలను స్వీకరించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి.
అవగాహనే నిజమైన ఆరోగ్యం: “హెల్త్ డ్రింక్”, “బూస్టర్”, “ఇమ్యూనిటీ పౌడర్” — ఇవి కేవలం మార్కెటింగ్ పదాలు మాత్రమే. ప్రజలు వాటి వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.
