Let's talk: editor@tmv.in
ఆరోగ్య‌శాఖ‌లోనూ 'అవేర్' సేవ‌లు: మంత్రి సత్యకుమార్ యాదవ్

ఆరోగ్య‌శాఖ‌లోనూ 'అవేర్' సేవ‌లు: మంత్రి సత్యకుమార్ యాదవ్

Panthagani Anusha
19 జనవరి, 2026

రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, అవి విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) లోని 'అవేర్' (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియంట్ ఎకోసిస్టమ్) విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కాగా వ్యాధుల నివారణలో సాంకేతికతను సమర్థవంతంగా వాడుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ‘అవేర్’ ద్వారా రాష్ట్రంలో వ్యాధుల తీవ్రతను అవి వ్యాప్తి చెందే అవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఐదారు సంవత్సరాల డేటా ఆధారంగా

ఈ విధానంలో గత ఐదారు సంవత్సరాలకు సంబంధించిన హిస్టారికల్ డేటాను విశ్లేషించనున్నారు. గ్రామాలు, సచివాలయాల వారీగా నమోదైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసుల వివరాలను పరిశీలించి ఏ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందో ముందే అంచనా వేస్తారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీజీఎస్ సాంకేతిక సాయంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సచివాలయాల వారీగా వ్యాధుల తీవ్రతను మ్యాపింగ్ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

మరోవైపు మాతా శిశు ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సచివాలయాల వారీగా గర్భిణులు, టీకాలు వేయించుకోవాల్సిన శిశువుల వివరాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తుపానుల వంటి విపత్తుల సమయంలో హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 'అవేర్' వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను వ్యవసాయం, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ, విపత్తు నిర్వహణ వంటి ఇతర శాఖలతో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర సమాచారంతో అంటువ్యాధులను అరికట్టేందుకు వీలవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆరోగ్య‌శాఖ‌లోనూ 'అవేర్' సేవ‌లు: మంత్రి సత్యకుమార్ యాదవ్ - Tholi Paluku