Let's talk: editor@tmv.in
‘ఆరోగ్యమే మహాభాగ్యం’: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Gaddamidi Naveen
30 మార్చి, 2026

నగరంలోని పీపుల్స్ ప్లాజా ఆదివారం ఉదయం యువ ఉత్సాహంతో ఉరకలేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమాల స్ఫూర్తితో నిర్వహించిన ‘యువ భారత్ రన్’ ఘనంగా జరిగింది. ఈ క్రీడా స్ఫూర్తి యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని యువతలో జోష్ నింపారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఆరోగ్యమే నిజమైన సంపద. ప్రతి యువకుడు తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం, యోగాను తమ దైనందిన జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై మాట్లాడుతూ, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మన సంప్రదాయ చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. సమాజానికి చేటు చేసే మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజమే దేశానికి అసలైన ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. అలాగే కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత ఆరోగ్యంతోనే ఫిట్ ఇండియా సాధ్యమని తెలిపారు.రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత పునర్నిర్మాణం, భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.

దేశవ్యాప్తంగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’

యువ భారత్ రన్‌తో పాటు, దేశవ్యాప్తంగా 65వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. సముద్ర తీరాల నుంచి పర్వతాల వరకు, ఎడారుల నుంచి అడవుల వరకు సుమారు 5000కు పైగా ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉద్యమం ఏకకాలంలో సాగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో 300 మందికి పైగా ‘ఫిట్ ఇండియా ఛాంపియన్స్’, అంబాసిడర్లు, ప్రముఖులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని బాదల్ నుంచి ఒడిశాలోని కోక్రాఝర్ వరకు, అలాగే దక్షిణాదిన ఆలప్పుజ వరకు ఈ సైక్లింగ్ యాత్ర విస్తరించింది. బీహార్ రాజధాని పాట్నాలో ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్ స్వయంగా సైకిల్ తొక్కి యువతకు ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ‘యువ భారత్ రన్’లో వేల సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొని ఫిట్ నెస్ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.