Let's talk: editor@tmv.in
ఆరు నెలలుగా వేతనాలు లేక కలవరంలో వైద్యులు

ఆరు నెలలుగా వేతనాలు లేక కలవరంలో వైద్యులు

Gaddamidi Naveen
8 అక్టోబర్, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. టీవీవీసీ బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది వేతనాలు లేక మానసిక బాధలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం శూన్యం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు రెండు, మూడు వారాలు ఆలస్యంగా జమ అవుతున్నాయని. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా బస్తీ దవాఖానల వైద్య సిబ్బందికి ఆరు నెలల నుండి వేతనాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

వైద్యులు, సిబ్బంది బతుకమ్మ, దసరా పండుగలను ఆనందించలేకపోయారనీ, వీరి మానసిక స్థితి దెబ్బతిన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఎన్నోసార్లు వేతనాలు జమ చేయమని విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అత్యవసర సేవలందిస్తున్న వైద్య సిబ్బందికే జీతాలు దిక్కులేకపోతే, ఇతర శాఖల ఉద్యోగులు పరిస్థితి ఏంటని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పథకాల్లో కేటాయింపుల కోతలు, వేతనాలు చెల్లించకపోవడం వంటివి ప్రభుత్వ పాలనలో జీతాలు చెల్లించకుండా వాతలు పెడుతున్నరన్నారు. రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో ఈ సమస్యలు తీవ్రమవడం ప్రజల్లో నిరాశ కలిగించింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానా సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, సపోర్ట్ స్టాఫ్)కి ఆరు నెలల జీతాలు బకాయిలుగా ఉన్నాయని, సుమారు రూ 8 కోట్ల విలువైన జీత బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు.

‘ఇదే రేవంత్ రెడ్డి పాలన. మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు. నీ వైఫల్యం రాష్ట్ర ప్రజలందరికీ శాపంగా మారింది” అంటూ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. “జీతాలు ఇవ్వకుండా 13 వేల మంది వైద్య సిబ్బందికి దసరా దూరం చేశావు. కనీసం ఇప్పుడైనా జీతాలు చెల్లించి వారికి దీపావళి సంబురం ఇవ్వాలి” అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

ఆరు నెలలుగా వేతనాలు లేక కలవరంలో వైద్యులు - Tholi Paluku