
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లుకు అనుమతించండి: స్పీకర్‌కు బీఆర్ఎస్ వినతి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసింది. ఈ మేరకు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ కల్పించేలా 'ప్రైవేట్ మెంబర్ బిల్లు'ను ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని కోరుతూ నోటీసు అందజేసింది.
ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన హామీలకు ఇది చట్టబద్ధత కల్పిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అత్యంత కీలకమైన బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందజేశారు. ప్రభుత్వ హామీలపై స్పష్టత రావాలంటే ఈ బిల్లు చర్చకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
