
ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ఒక్క హామీకి కూడా చట్టబద్ధత కల్పించలేదు అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీకి రూ. 1000 కోట్లు పంపడంపై ఉన్న శ్రద్ధ, రైతుబంధు నిధులు విడుదల చేయడంపై చూపడం లేదని ఆయన ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విసిరిన డ్రగ్ టెస్ట్ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. మేము ఏ రకమైన పరీక్షకైనా సిద్ధం. కేవలం డ్రగ్ టెస్ట్ మాత్రమే కాదు, అవసరమైతే ఎమ్మెల్యేలందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అని సవాల్ విసిరారు. రైతుబంధు ఆర్థిక సహాయం అందకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో జాప్యం, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలను అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తుతామని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు పోరాడతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
