
ఆర్డీటీ కోసం కదిలిన అనంతపురం
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ ఉద్యమం అనంతపురంలో తారాస్థాయికి చేరింది. పదివేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అనంత వీధులు నినాదాలతో హోరెత్తాయి. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. అనంతపురంలో ఈ స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకి రావడానికి కారణం ప్రభుత్వాల వైఖరే అని నిరసనకారులు చెబుతున్నారు.
ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అనంతపురం జిల్లాకు వరప్రదాయిని. 60 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ప్రభుత్వానికి సమాంతరంగా.. ప్రభుత్వాని కంటే ఎక్కువగా పేదల సేవలో ఆర్డీటీ కొనసాగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కారణంగా ఆర్డీటీకి విదేశీ నిధులు ఆగిపోయాయి. వాటిని కేంద్రం పునరుద్ధిరిస్తేనే ఆర్డీటీ సేవలు కొనసాగుతాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా రోజులుగా జిల్లా ప్రజల నుంచి విన్నపం వెళ్లింది. ప్రజాప్రతినిధుల కాలయాపన, నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓత్తిడి లేకపోవడమూ ఒక కారణమని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొక్కుబడిగా అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా కదలిక లేదు. కేంద్ర ప్రభుత్వం కారణంగానే ఆర్డీటికి నిధులు ఆగిపోయే ప్రమాదం వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపడంలేదన్న ఆగ్రహం ప్రజల్లో ఉంది.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 15న ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాదాపు 10 వేల మంది ప్రజలు రోడ్డెక్కడంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సమైక్యాంధ్రా తర్వాత ఈ స్థాయిలో జనం రోడ్ల మీదకి రావడం ఇదే తొలిసారి. ప్రజాగ్రహానికి ఈ నిరసన ర్యాలీ అద్దం పడుతుంది. ఆర్డీటీ సేవలు ఆగిపోతే లక్షలాది మంది జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. ఆ స్థాయిలో ప్రజల్లోకి ఆర్డీటీ సేవలు వెళ్లాయి. విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ ఆర్డీటీ ప్రజలకు సేవలందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేస్తే అనంతపురంలో ఆర్డీటీ సేవలు ఆగిపోతాయి. కానీ ఆర్డీటీ ఆగదు. ఇంకో దేశంలో తన సేవలు అందిస్తుంది. ఫలితంగా అనంతపురం జిల్లా ప్రజలు నష్టపోతారు. ఇదే ఇప్పుడు అనంత ప్రజల ఆవేదన.
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలన్నది అనంతపురం జిల్లా ప్రజల ప్రధాన డిమాండ్. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. కేంద్రం అనంత ప్రజల ఆవేదన పట్టించుకోవడంలేదు. ఆర్డీటీ కనుక అనంతపురం నుంచి వెళ్లిపోతే ..ఈ అంశం రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే దళిత బలహీనవర్గాల జనాభా అనంతపురం జిల్లాలో ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది ఆర్డీటీ సేవలు అందుకున్నారు. అందుకుంటున్నారు. ఆ సేవలు ఆగిపోతే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాంగానే ప్రజలు చూస్తారు. కాబట్టి ఆ ప్రభావం టీడీపీపై ఉంటుంది. బీజేపీ, టీడీపీ ఇప్పటికైనా తేరుకుని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అనంతపురం జిల్లా వాసులు కోరుతున్నారు.
