Let's talk: editor@tmv.in
ఆర్జేడీ లేకుండా మహా ఘట్బంధన్ నిలుస్తుందా?

ఆర్జేడీ లేకుండా మహా ఘట్బంధన్ నిలుస్తుందా?

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహర్ లో లాలూ ఉంటాడు. బీహార్ ప్రజల్లో, రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బంధం అంతగా పేనవేసుకుపోయింది. లాలూ అంటే బీహార్, బీహార్ అంటే లాలూ అనేలా మారింది. ఆర్జేడీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఆర్జేడీ ని లాలూ ప్రసాద్ యాదవ్ 1997 లో స్థాపించారు. 1998 నుంచి 2005 వరకు బీహార్ లో ఏనిమిది సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి స్థానాన్ని సాధించింది లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే రానున్న 2025 శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడంతో మహాఘట్బందన్(కూటమి) లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీహార్ లో ఓటర్ జాబితా సవరణపై ఆందోళనలు, ఓట్ అధికార్ యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తో పాటు పాల్గొని కూటమి ఐక్యతను చాటారు. కూటమి పటిష్టంగా ఉంది అనే సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఓట్ అధికార్ యాత్రలో భాగంగా ఆరా పట్టణంలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలోనే తేజస్వీ యాదవ్ తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పకనే చెప్పారు.

సీట్ల సర్దుబాటు పై చర్చలు

ఎన్డీయే కూటమి చాలా వేగంగా ఎన్నికల మైదానంలో దూసుకెళుతుంది. ఇప్పటికే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, సీట్ల పంపకాలపై చివరి చర్చలు జరుగుతుండడంతో, ఘట్బంధన్ లోనూ ఆ జోరు పెంచేలా తేజస్వీ ఇటీవల ఆయన నివాసంలో సీట్ల సర్దుబాటుపై కదలికలు తెచ్చారు. ఈ సందర్భంగా సీట్ల విషయంలో కూటమిలో ఉన్న పార్టీలు త్యాగాలు చేయాల్సి ఉంటుందని, మరో రెండు కొత్త పార్టీలు జతకడుతున్నాయని ఆయా పార్టీల అధినేతలకు హింట్ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన మరునాడే కాంతి లో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆర్జేడీ 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించి సంచలనాలకు తెర తీశారు.

మహా ఘట్బందన్ ఆర్జేడీ ని వదులుకుంటుందా?

ఇప్పుడు ఘట్బందన్ లోని మిత్రపక్షాలు తేజస్వీ యాదవ్ ప్రకటనతో అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా బీహార్ లో గెలిచి తీరాలనే ఉద్దేశంతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ సమస్య పంటి కింద రాయిలా తయారైంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆర్జేడీతో చర్చలు చేస్తోంది. మహా ఘట్బందన్ లో ఆర్జేడీనే పెద్ద పార్టీ గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీచేసి దాదాపు 75 స్థానాలను కైవసం చేసుకుంది. అందులోనూ బీహార్ లో ఉన్న యాదవ్, ముస్లింల మద్దతు ప్రధానంగా ఆర్జేడీ వైపే ఉంది. ఆయా వర్గాలు పార్టీకి మొదటి నుంచి వెన్నెముక నిలుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్జేడీ ని వదులుకుని కూటమి తప్పు చేస్తుందనుకోం. అలాగే లాలూ మొదటి నుంచి ప్రజల్లో చరిష్మా కలిగిన నేత. ఎటువంటి ఆరోపణలు వచ్చినా, జైల్లో ఉన్నా రాజకీయంగా ప్రాబల్యం తగ్గని నాయకుడు. తేజస్వీ యాదవ్ తండ్రికి తగ్గ తనయుడు యువనేత గా ఇప్పటికే ప్రజల్లోకి దూసుకుపోయారు. మాస్ నాయకుడిగా ఎదిగారు. అధికార పక్షాన్ని ప్రశ్నించడంలో వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నారు. మొత్తానికి ఆర్జేడీకి అన్ని వర్గాల్లో పూర్తి మద్దతు ఉంది. ఆర్జేడీ లేని మహాఘట్బంధన్ అంటే శనగలు లేని పులిహోర లాంటిది అని బీహార్ లో ఉన్న నానుడి.

కాంగ్రెస్ చిన్నపార్టీలతో కలిసి ఎన్నికల్లో పోరాడగలదా?

వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ లేకుండా కాంగ్రెస్ ఇతర చిన్నపార్టీలను కలుపుకుని ముందుకు సాగలేదు. వాటికి అంత శక్తి లేదు. ఇతర ప్రాంతీయ పార్టీలు బీహార్ రాజకీయ మైదానంలో అంతగా ప్రభావం చూపలేవు. ఆర్జేడీ స్థాయిని చేరుకోలేవు. ఓట్ అధికార్ యాత్రలో వచ్చిన జనాలను చూసి ఒంటరిగా పోవాలనుకుంటే దానికంటే మరో చారిత్రక తప్పిదం ఉండదు. దాంతో పాటు ప్రజల నాడీ తెలిసిన నాయకుడు కాంగ్రెస్ లోనూ దుర్భిణి వేసి వెతికినా దొరకని పరిస్థితి. ఆర్జేడీ కూటమిని వీడితే ఇది ఎన్డీయేకు మరింతగా కలిసొచ్చే అంశంగా మారుతుంది. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లోనే సరైన ఫలితాలను సాధించింది.

సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతోనే పేచీనా?

ఎన్డీయే నితీశ్ సారథ్యంలోనే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకుంటామని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఎన్డీయేలోని పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. నితీశ్ కుమార్ కు ధీటుగా మహాఘట్బందన్ లోనూ సీఎం అభ్యర్థని ప్రకటించాల్సి ఉంది. కానీ ఈ అంశం పై పార్టీల మధ్య సరైన అభిప్రాయం కుదరలేదు. ప్రజలే సీఎంని నిర్ణయిస్తారని ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీహార్ ఇన్ ఛార్జ్ కృష్ణ అల్లవేరు వ్యాఖ్యానించడంతో మరింత గందరగోళం నెలకొంది. దీంతో తేజస్వీ యాదవ్ ఈ విషయం తేల్చుకోవాలనే మొత్తం స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించినట్టు భావిస్తున్నారు.ఏమైనప్పటికీ బీహార్ ఎన్నికల్లో మహాఘట్బంధన్ లో ఆర్జేడీ లేకుండా ఎన్నికల్లోకి దూకడమంటే సేనాధిపతి లేకుండా కదనరంగంలోకి అడుగుపెట్టినట్లేనని, లాంతరు వెలుగులు లేకుండా చీకట్లో ప్రయాణించడమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

ఫోటో రైటప్; మాట్లాడుతున్న తేజస్వీ యాదవ్