
ఆర్జేడీ పాలనలో మహిళలకు కష్టాలు
రాష్ట్రీయ జనతాదళ్ పాలనలో బీహార్ మహిళలు అష్టకష్టాలు పడ్డారని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. వారి పాలనలో రాష్ట్రంలో కనీసం చట్టాలు కూడా అమలు కాలేదని చెప్పారు. విపరీతమైన బంధుప్రీతి, అవినీతి రాజ్యమేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయే పాలన ఎంతో బాగుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు. శుక్రవారం ఆయన మహిళా రోజ్ గార్ యోజన పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. బీహార్‌లో ఆర్జేడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు పాడైపోవడం, వంతెనలు లేకపోవడం వల్ల గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు చేరలేకపోయేవారని మోడీ గుర్తు చేశారు. ఆ పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేయడానికి తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారులో బీహార్‌లో రోడ్లు నిర్మించామని పేర్కొన్నారు.
అప్పట్లో మావోయిస్టుల హింస
ఆర్జేడీ పాలనలో మావోయిస్టుల హింస భయానకంగా ఉండేదని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో చట్ట పరిపాలనను స్థాపించారని ప్రశంసించారు. 30 ఏళ్ల లోపు ఉన్నవారికి అప్పటి పరిస్థితుల తీవ్రత తెలియదని ప్రస్తుతం పెద్ద వయసులో ఉన్నవారు ఆ నాటి భయనాక పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఆర్జేడీ పాలనలో నక్సలైట్ హింస విపరీతంగా ఉండేదన్నారు. మహిళలే అత్యధికంగా బాధితులయ్యారు. పేదల నుండి వైద్యులు, ఐఏఎస్ అధికారుల కుటుంబాలు వరకు ఎవరూ ఆర్జేడీ నేతల దౌర్జన్యాల నుండి తప్పించుకోలేదని పేర్కొన్నారు. నేడు నితీశ్ కుమార్ నాయకత్వంలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోందన్నారు. మహిళలకు అత్యంత ఉపశమనం లభించిందన్నారు. ఇప్పుడు బీహార్ యువతులు భయపడకుండా బయటకు రావచ్చు. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ముందు ఇది సాధ్యమేనని మోడీ పేర్కొన్నారు.
నేరుగా పేదల ఖాతాల్లోకి నగదు
రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, ప్రజల దగ్గరకు 15 పైసలే చేరతాయని ఒక ప్రధాని చెప్పిన సంగతి గుర్తు. మిగతా డబ్బు దారి మధ్యలో లూటీ చేయబడేది. ఇది మీపై జరిగిన పెద్ద అన్యాయం. కానీ నేడు, డబ్బు నేరుగా మీ ఖాతాల్లోకి చేరుతోంది’ అని మోడీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నేరుగా జమ చేశారు. మొత్తంగా రూ.7,500 కోట్లు పంపిణీ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాష్ట్రీయ జనతా దళ్‌ను తీవ్రంగా విమర్శించారు.
