Let's talk: editor@tmv.in
ఆర్ఆర్‌ఆర్‌ బాధితులు ఐక్యంగా పోరాడాలి: కేటీఆర్

ఆర్ఆర్‌ఆర్‌ బాధితులు ఐక్యంగా పోరాడాలి: కేటీఆర్

T Venkata Ramana
23 సెప్టెంబర్, 2025

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు ఐక్యంగా పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులతో సమావేశమైన కేటీఆర్, వారి కష్టాలను సానుభూతితో ఆలకించారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని ఆయన రైతులకు సూచించారు.

పోరాటంతోనే పరిష్కారం

సమస్య పరిష్కారం కాకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరించడం ద్వారా అది ఢిల్లీ వరకు వెళ్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మీ కష్టం అర్థమయ్యేలా చేయాలన్నారు కేటీఆర్. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. "మాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది. కత్తి వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు" అంటూ ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అలైన్‌మెంట్‌లో అక్రమాలు

రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ విషయంలో కాంగ్రెస్ నేతల భూములను తప్పించేందుకు మార్పులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణ సమయంలో కూడా ఇలాంటి అలైన్‌మెంట్ అక్రమాలే జరిగాయని గుర్తు చేశారు. "ఓఆర్‌ఆర్ సమయంలో భూసేకరణ జరిగినప్పుడు, భూమికి బదులు భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే మనం పోరాటం చేయాలి. అలైన్‌మెంట్ శాస్త్రీయంగా ఉండేలా చూడాలని మనం కలిసికట్టుగా ఉద్యమిద్దాం," అని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

ఆర్ఆర్‌ఆర్‌ బాధితులు ఐక్యంగా పోరాడాలి: కేటీఆర్ - Tholi Paluku