
‘ఆయుష్’ వైద్యులపై మీ అభిప్రాయం చెప్పండి: కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
ఆయుష్ వైద్యులను కూడా అల్లోపతి వైద్యుల మాదిరిగా చట్టపరంగా ‘రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు’గా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలను చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ పిల్‌పై కేంద్ర న్యాయ, ఆరోగ్య, ఆయుష్ మంత్రిత్వ శాఖలు తమ వివరాలను సమర్పించాలని కోర్టు సూచించింది. అంతేకాకుండా, ఔషధ ప్రకటనల నియంత్రణకు సంబంధించిన 1954 నాటి ‘డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్) చట్టం’లోని షెడ్యూల్‌ను ప్రస్తుత శాస్త్రీయ పరిణామాలకు అనుగుణంగా పునఃసమీక్షించి నవీకరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఈ పిల్‌లో ఉంది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వాదనలను పరిగణనలోకి తీసుకొని నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌ను ఆయన కుమారుడు, న్యాయ విద్యార్థి నితిన్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్,
ఆయన మీ కుమారుడేనా అని అశ్విని ఉపాధ్యాయ్‌ను ప్రశ్నించారు. అవును అని ఆయన సమాధానమిచ్చారు. దీనికి స్పందించిన ధర్మాసనం,
మేము ఆయన బంగారు పతకం సాధిస్తాడేమో అనుకున్నాం… కానీ ఇప్పుడు పిల్‌లు వేస్తున్నారు. ముందు చదువుపై దృష్టి పెట్టాలి కదా?… నోటీసు జారీ చేయండి. ఇది కేవలం మీ కుమారుడి కోసమే. అతను బాగా చదవాలని అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్‌లో, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్) చట్టం, 1954లోని సెక్షన్ 2(సీసీ) కింద ఆయుష్ వైద్యులను కూడా ‘రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు’గా గుర్తించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సెక్షన్ల వల్ల ఇబ్బందులు
ఈ చట్టం ప్రధానంగా కొన్ని ఔషధాల ప్రకటనలను నియంత్రించడం, అలాగే ‘మాయాజాల గుణాలు ఉన్నాయని’ చెబుతూ ప్రచారం చేసే చికిత్సల ప్రకటనలను నిషేధించడమే లక్ష్యంగా రూపొందించింది. ఇందులోని సెక్షన్ 2(సీసీ)లో ‘రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్’ నిర్వచనం ఇచ్చింది. తప్పుడు, మోసపూరిత వైద్య ప్రకటనల నుంచి ప్రజలను రక్షించడమే ఈ చట్టం ఉద్దేశం. అయితే ఇందులోని సెక్షన్ 3(డీ) కొన్ని వ్యాధులు, పరిస్థితులకు సంబంధించిన ప్రకటనలపై సంపూర్ణ నిషేధం విధిస్తోందని పిల్‌లో పేర్కొన్నారు. అయితే ఆయుష్ వైద్యులు, ఇతర అల్లోపతి కాని రిజిష్టర్డ్ వైద్యులు ఈ చట్టంలోని సెక్షన్ 14లోని మినహాయింపుల పరిధిలోకి రాకపోవడం వల్ల, తీవ్రమైన వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ఉనికిని కూడా వారు ప్రచారం చేయలేకపోతున్నారని పిల్ పేర్కొంది. దీని వల్ల ప్రజల్లో అవగాహన లోపిస్తోందని వాదించింది.
న్యాయవాది అశ్వని కుమార్ దూబే ద్వారా దాఖలైన ఈ పిల్‌లో, సెక్షన్ 3(డీ) ఒక సంపూర్ణమైన, అంధ నిషేధం విధిస్తోందని, ఇది తప్పుడు ప్రకటనలకూ, శాస్త్రీయంగా నిజమైన సమాచారానికీ తేడా చూపడం లేదని పేర్కొన్నారు. ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ, నివారణ, చికిత్సపై సమాచారం తెలుసుకునే ప్రజల హక్కును, పాతకాలపు చట్టం ద్వారా అనవసరంగా అడ్డుకుంటున్నారని పిల్ ఆరోపించింది. హానికరమైన ప్రకటనలపై తక్షణ నిషేధం విధించాలన్న ఉద్దేశంతో రూపొందిన ఈ చట్టం, ఇప్పుడు ఆయుష్ వైద్యులు చేసే నిజమైన వైద్య ప్రకటనలన్నింటిపై అంధ నిషేధంగా మారిపోయిందని పిల్‌లో పేర్కొన్నారు. నిజాయితీతో, శాస్త్రీయ ఆధారాలతో, మోసం లేని విధంగా చేసే ఔషధ ప్రకటనలు వినియోగదారులు, రోగులకు అవసరమైన సమాచారాన్ని అందించే న్యాయబద్ధ మార్గమని పిల్ వాదించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధారాల ఆధారిత వైద్య జ్ఞానానికి అనుగుణంగా డీఎంఆర్ చట్టంలోని షెడ్యూల్‌ను సమీక్షించి, సవరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరారు.
