
ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం
పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్స విధానంతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగు శిక్షణతో శస్త్ర చికిత్స ప్రక్రియకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు.
ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి, 2020 నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేలా తగు గుర్తింపుతో పాటు అనుమతినివ్వడానికి మంత్రి అంగీకరించారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే శస్త్ర చికిత్సా విధానంలో పీజీ పట్టా పొందిన వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం లభిస్తుంది.
ఈ తాజా ప్రభుత్వ నిర్ణయం మేరకు 39 శల్యతంత్ర (జనరల్ సర్జరీ) చికిత్సలు, 19 శలక్యతంత్ర(ఇఎన్‌టి, ఆప్తమాలజీ) చికిత్సలను ఆయుర్వేద వైద్యులు చేయవచ్చు. వీటిలో అంటు వ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు, ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న జీవ కణాల తొలగింపు, గాయాలకు చికిత్స కుట్లు వేయడం, మొలలు,మలద్వారంలో చీలికలకు చికిత్స, కణుతులు, శుక్లాలు, గవదల తొలగింపు, కండరాల చికిత్స, చర్మ మార్పిడి చికిత్స(స్కిన్ గ్రాఫ్టింగ్) లాంటివి ఉన్నాయి.
ఈ అంశంపై తదుపరి చేపట్టాల్సిన చర్యల్ని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆయుష్ విభాగం డైరెక్టర్ కె.దినేష్ కుమార్, ఇతర అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్‌యస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు మరో రెండు ప్రైవేట్ కళాశాలలున్నాయని, ఆయా కళాశాలల్లో పీజీ స్థాయిలో అందించబడుతున్న కోర్సుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో తక్షణమే శల్యతంత్ర, శకల్యతంత్ర పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ కోర్సులకు అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్ర చికిత్స పరికరాలను తగు స్థాయిలో అమర్చాలని మంత్రి సూచించారు.
2,500 సంవత్సరాల చరిత్ర కలిగిన శల్య, శకల్య ఆయుర్వేద చికిత్స పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆ విద్యనభ్యసించిన వారు శస్త్ర చికిత్సలు చేపట్టే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారతీయ వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక ప్రక్రియలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
ఇందుకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలోనే విడుదల చేసినా గత ప్రభుత్వం అనంతర చర్యలు చేపట్టలేదని, ఆయుష్ సేవల పట్ల వారి నిర్లక్ష్యానికి ఇది మరో తార్కాణమని మంత్రి అన్నారు.
ఈ నిర్ణయం యొక్క నేపథ్యం
భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధానం వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ముఖ్యంగా సుశ్రుత సంహిత ఆధారంగా అభివృద్ధి చెందిన శల్యతంత్రం(జనరల్ సర్జరీ) శాలాక్యతంత్రం(ఐ, ఈఎన్టి) ప్రపంచ వైద్య చరిత్రలోనే అత్యంత పురాతన శస్త్ర విజ్ఞానంగా గుర్తించబడింది. అయితే కాలక్రమేణా ఆధునిక అల్లోపతి వైద్యం విస్తరించడంతో ఆయుర్వేద శస్త్రచికిత్సలకు తగిన ప్రోత్సాహం లభించలేదు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (ఐఎమ్సిసి, 2020 నిబంధనలు) ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ శస్త్రచికిత్సల అనుమతి ప్రతి ఆయుర్వేద వైద్యుడికి కాదు. వైద్యులు తప్పనిసరిగా బిఏఎమ్ఎస్ పూర్తి చేసి ఉండాలి. శల్యతంత్రం లేదా శాలాక్యతంత్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. తగిన శిక్షణ, క్లినికల్ అనుభవం ఉండాలి. ప్రభుత్వం / సంబంధిత మండలి గుర్తింపు పొందాలి. అర్హత లేని ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతి ఉండదు. ఈ నిర్ణయం ప్రకారం మొత్తం 58 శస్త్ర చికిత్సలు చేయవచ్చు. ఈ నిర్ణయంతో కలిగే లాభాలు చాలా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో శస్త్ర చికిత్సల అందుబాటు పెరుగుతుంది. ఆయుష్ వైద్యులకు వృత్తిపరమైన గుర్తింపు పెరుగుతుంది. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు బలోపేతం అవుతాయి. అల్లోపతి ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. భారతీయ వైద్య సంప్రదాయానికి గౌరవం పెరుగుతుంది
వివాదాలు, విమర్శలు
ఈ నిర్ణయంపై కొందరు అల్లోపతి వైద్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వారి వాదనల ప్రకారం, శస్త్రచికిత్సలు అత్యంత సున్నితమైనవి. రోగుల భద్రత ముఖ్యమని,అన్నీ చోట్లా ఒకే విధమైన ప్రమాణాలు ఉండాలని అంటున్నారు.
దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, అర్హత, శిక్షణ, పర్యవేక్షణతోనే అనుమతి ఇవ్వ బడుతుంది. ఇది ఆధునిక వైద్య విధానానికి పోటీ కాదు, సహకారం మాత్రమే. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే అమలులో ఉంటాయని తెలిపింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల ప్రకారం, విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో శల్యతంత్ర పీజీ కోర్సు, శాలాక్యతంత్ర పీజీ కోర్సు తక్షణమే ప్రారంభించాలి. ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుచేయాలి. అదునాతన శస్త్రచికిత్స పరికరాలన్ని వైద్యశాలల్లో ఏర్పాటుచేయాలి. నాణ్యమైన అధ్యాపకులు శిక్షణ ఇవ్వాలి. ఈ నిర్ణయం వల్ల ఆయుర్వేద శస్త్ర విజ్ఞానం పునరుజ్జీవనం, యువ వైద్యుల్లో ఆయుర్వేదంపై ఆసక్తి, భారత్‌కు ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ మెడిసిన్ మోడెల్ అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో భారతీయ వైద్యానికి గుర్తింపు లబిస్తాయని పేర్కొంది.
2500 సంవత్సరాల పురాతన ఆయుర్వేద శస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమైనది. సరైన నియంత్రణ, నాణ్యమైన శిక్షణ ఉంటే ఇది ప్రజారోగ్య వ్యవస్థకు మేలు చేస్తుందని మంత్రి తెలిపారు.
