
ఆయుధాలతో మార్పు సాధ్యం కాదు:మాజీ మావోయిస్టు భూపతి
నాలుగు దశాబ్దాలు మధ్య దేశంలోని దట్టమైన అడవుల్లో గడిపిన తరువాత, సహచరులు ఒక్కొక్కరుగా మరణించడం చూడలేకపోయానని, ఆయుధ పోరాటం ఫలప్రదం కాదని గ్రహించానని మాజీ నక్సలైట్ నాయకుడు మల్లోజుల వెంకటగోపాల్ రావు అలియాస్ భూపతి తెలిపారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పాలిట్‌బ్యూరో,సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న భూపతి, గడ్చిరోలిలో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నక్సలిజం సమాజంలో దోపిడీ కొనసాగినప్పుడే పుడుతుంది. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా వ్యవస్థ పని చేయాలని అన్నారు.
లొంగుబాటు
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో అతనిపై 70కిపైగా కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 15, 2025న 60 మంది మావోయిస్టులతో కలిసి భూపతి లొంగిపోయాడు. తెలంగాణలోని పెద్దపల్లి ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన, 1970లలో 1946–53 మధ్య తెలంగాణలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావంతో నక్సలైట్ ఉద్యమంలో చేరినట్టు తెలిపారు. 2024 నవంబరులోనే ఆయుధాలతో పని చేయడం ఇక సాధ్యం కాదని మా నాయకత్వానికి గణపతి, బసవరాజ్, దేవ్జీకి స్పష్టంగా చెప్పాను. కొందరు అంగీకరించారు, కొందరు విభేదించారు. సహచరులు మన కళ్లముందే మరణించడాన్ని చూడాల్సి రావడం నా నిర్ణయానికి కారణమని 70 ఏళ్ల భూపతి చెప్పారు. 43 సంవత్సరాలు అడవుల్లో గడిపాను. 15 సంవత్సరాల తర్వాతే తొలిసారి విద్యుత్ చూశానని ఆయన తెలిపారు.
ఉద్యమం విఫలమైంది
మా పోరాటం పోలీసులతో కాదు, వ్యవస్థతో. కానీ గడ్చిరోలిలో 2013 తర్వాత నుంచి కొత్త నియామకాలు జరగలేదు. ప్రజల నుంచి దూరమైతే ఏ సంస్థైనా అంతమవుతుందని భూపతి అన్నారు. నక్సలైట్ ఉద్యమం విఫలమైందని, మిగిలిన సభ్యులు ప్రధాన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. తన సహచరుల గురించి మాట్లాడుతూ, హిడ్మా సంస్థకు ముఖ్యమైన వ్యక్తి అని, సోషల్ మీడియా వల్ల యువతలో ఆదరణ పొందినట్టు చెప్పారు. 2008 నుంచి 2021 వరకు కలిసి పనిచేసిన మిలింద్ టెల్తుంబ్డే మంచి మిత్రుడని, అతడూ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. 2025 ఏప్రిల్‌లో నేను, బసవరాజ్ ప్రధాన స్రవంతిలోకి రావడానికి సిద్ధమయ్యాం. కానీ అతను నిర్ణయం మార్చుకున్నాడు. తరువాత ఎన్‌కౌంటర్‌లో మరణించాడని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు గణపతి కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు.
వ్యక్తిగత జీవితం
భారత స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడైన భూపతి ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకున్నాడు. 1983 జనవరి 24న ఇంటిని విడిచిపెట్టాడు. తిరిగి వెళ్లలేదు. 1986లో అతని భార్య కూడా మావోయిస్టు సంస్థలో చేరింది. 1987లో గడ్చిరోలిలోని అహేరి తాలూకాలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడటంతో లొంగిపోవాలని తానే సూచించినట్టు చెప్పారు. తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్‌జీ) తన హీరో అని, 2011లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించాడని గుర్తుచేశారు. అడవుల్లో జీవితం కష్టమైందని, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగినా ఉద్యమంలో చీమల నుంచి పాముల వరకు అన్నీ తినాల్సి వచ్చిందని చెప్పారు. నేను నా రాజకీయ సిద్ధాంతాన్ని వదల్లేదు. కేవలం ఆయుధాలను మాత్రమే వదిలాను అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని సామాజిక–రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నానని, భవిష్యత్తుపై తక్షణ వ్యాఖ్య చేయలేనని ఆయన పేర్కొన్నారు.
