
ఆయిల్‌పామ్‌పై బీహార్.. మకానాపై తెలంగాణ ఆసక్తి
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న డిజినల్ సాంకేతికత, సంక్షేమ పథకాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలపై బీహార్ ప్రభుత్వం తీవ్ర ఆసక్తి వ్యక్తం చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణపై ఇరువురు మంత్రులు సమగ్రంగా చర్చించారు.
తెలంగాణలో వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మంత్రి తుమ్మల వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, ‘రైతు నేస్తం’ ద్వారా రైతులను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం చేయడం, క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్ అప్లికేషన్, అగ్రిస్టాక్ ద్వారా రైతుల గుర్తింపు వంటి కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత కృషివాస్ పంటల పర్యవేక్షణ వ్యవస్థతో పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో సత్వర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతుల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు దిగుబడి, లాభదాయకత పెరుగుతాయని చెప్పారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తుమ్మల తెలిపారు. రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ తదితర పథకాల అమలును వివరించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వివరించారు.
పంటల వైవిధ్యీకరణలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను కూడా మంత్రి వివరించారు. వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్ వంటి పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందన్నారు. 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి, 20.01 శాతం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో సాధించినట్లు వివరించారు. నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లులు, మైక్రో ఇరిగేషన్ తదితర సదుపాయాలపై బీహార్ మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్, అంతర్జాతీయ అవకాశాలను పెంచేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయిల్‌పామ్‌పై బీహార్ ఆసక్తి.. మకానాపై తెలంగాణ ఆసక్తి
బీహార్ లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టే అవకాశాలను పరిశీలిస్తామని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు త్వరలో అధికారుల, ప్రతినిధుల బృందాన్ని పంపుతామని చెప్పారు. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, మైక్రో ఇరిగేషన్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తుమ్మల హామీ ఇచ్చారు.
అదే సమయంలో బిహార్‌లో ప్రత్యేకంగా సాగయ్యే మకానా పంటపై మంత్రి తుమ్మల ఆసక్తి చూపారు. మకానా సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్ కు పంపాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ వ్యవసాయ విధానాలను పరస్పరం పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
అర్బన్ ఫార్మింగ్‌కు ప్రోత్సాహం
అర్బన్ ఫార్మింగ్, మిద్దె పంటలు, కిచెన్ గార్డెనింగ్‌ను నగర ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అర్బన్ ఫార్మింగ్ & కిచెన్ గార్డెనింగ్ ఎక్స్పో–2026’లో ఆయన పాల్గొన్నారు. తాజా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని అన్నారు.
బాల్కనీ, టెర్రస్, ఇంటి ప్రాంగణం వంటి చిన్న ప్రదేశాల్లో కుండీలు, గ్రో బ్యాగులు, ఇతర కంటైనర్లలో కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు, కూరగాయలు, మూలికలను సులభంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. టెర్రస్‌లు, బాల్కనీలు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, కార్యాలయాల్లోనూ అర్బన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ‘తాజాగా పండిద్దాం–ఆరోగ్యంగా తిందాం–పచ్చగా జీవిద్దాం’ అనే సందేశం ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రైతు నేస్తం చైర్మన్ వై. వెంకటేశ్వరరావు, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
