
ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆఫ్రికాలోని అంగోలా, బోట్స్ వానా దేశాల పర్యటనకు వెళ్లారు. ఇంతవరకు ఏ భారత రాష్ట్రపతి ఈ దేశాలలో పర్యటించలేదు. రాష్ట్రపతి భవన్ ఒక ‘ఎక్స్’ లో ఈ విధంగా పేర్కోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ పర్యటన ప్రాధాన్యాన్ని వివరించింది. ఆఫ్రికా, గ్లోబల్ సౌత్‌తో భారత బంధాలను బలోపేతం చేయడంలో ఇది మరో కీలకమైన అడుగు. అంగోలా, బోట్స్ వానా దేశాలలో తొలి పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు అని ఎంఈఏ తెలిపింది.
రక్షణ, ఇంధన రంగాలపై దృష్టి
అంగోలాతో భారత రక్షణ, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ పర్యటనలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఈఏ ఆర్థిక సంబంధాల కార్యదర్శి సుధాకర్ దలేలా వివరించారు. అంగోలాతో రక్షణ సహకారం, లైన్స్ ఆఫ్ క్రెడిట్ ప్రధానంగా చర్చించే అంశాలుగా ఉండనున్నాయి. రెండు దేశాల మధ్య 5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ వాణిజ్యం ఒప్పందం ఇప్పటికే ఉంది. దానిలో 80 శాతం ఇంధన రంగానికే సంబంధించినది. భారత్‌కి అంగోలా కీలక ఇంధన భాగస్వామి అని తెలిపారు. బోట్స్ వానా ప్రాజెక్ట్ చీతా కింద భారతదేశానికి గణనీయమైన సంఖ్యలో చీతాలను పంపడానికి సిద్ధంగా ఉందని ఎంఈఏ వెల్లడించింది. దీని ద్వారా భారత వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలకు మద్దతుగా కీలకంగా నిలుస్తుందని పేర్కొంది.
భారత్ – అంగోలా సంబంధాలు
ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్తవి కావు. 1985లో మొదట దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి, ఆ తర్వాత అనేక రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ప్రధాన ఒప్పందాలు / అవగాహన పత్రాలు (ఎంఓయూస్):
ఆయా రంగాల్లో ఒప్పందాలు
అంగోలా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతి చేసు కుంటుంది. అలాగే ఓఎన్జీసీ, విదేశ్ లాంటి భారత కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. 2010లో భారత ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చే అవగాహన ఒప్పందం ఉంది. పాన్ ఆఫ్రికన్ ఇ–నెట్ వర్క్ ప్రాజెక్టు కింద భారత్ అందిస్తున్న టెలీ–ఎడ్యుకేషన్, టెలీ–మెడిసిన్ సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పెద్ద సంస్థలతో ఒప్పందాలేవీ లేవు. కానీ 2023లో అంగోలా అధ్యక్షుడు భారత్‌కి వచ్చినప్పుడు రక్షణ సహకారంపై చర్చలు జరిగాయి. ఈసారి రాష్ట్రపతి పర్యటనలో ఆ ఒప్పందాన్ని అధికారికంగా పూర్తి చేసే అవకాశం ఉంది.
భారత్ – బోట్స్ వానా సంబంధాలు
ఈ ఆఫ్రికా దేశంతో 1971లో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వజ్రాలు, బంగారం, ఫార్మాస్యూటికల్స్, యంత్ర పరికరాల ఎగుమతుల్లో వ్యాపారం ఉంది. అలాగే ఇండియన్ టెక్నికల్, ఎకనామిక్ కోఆపరేషన్ లో భాగంగా ఆ దేశ అధికారులకు శిక్షణ. 2023–24లోనే బోట్స్వానా నుంచి చీతాలు తరలించేందుకు చర్చలు మొదలయ్యాయి. ఈసారి పర్యటనలో అధికారిక ఒప్పందం ఖరారు కావొచ్చు.
