Let's talk: editor@tmv.in
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌తో మిజోరంకు రూ.960 కోట్ల నష్టం

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌తో మిజోరంకు రూ.960 కోట్ల నష్టం

Dantu Vijaya Lakshmi Prasanna
1 మార్చి, 2026

మిజోరాం రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా పశుసంవర్ధక రంగం కుదేలైంది. 2021 మార్చిలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగుచూసినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు రూ.960 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సి. లాల్సావివుంగా శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. ఈ మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పందుల పెంపకంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వైరస్ తొలిసారి 2021 మార్చి నెలలో మిజోరంలో గుర్తించబడింది. అప్పటి నుంచి ఈ వైరస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ పందుల పెంపక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పటివరకు మొత్తం 71,912 పందులు మృతి చెందగా, ఈ నష్టంతో 8,966 కుటుంబాలు నేరుగా ప్రభావితమయ్యాయి. మిజోరంలో పంది పెంపకం అనేది అనేక గ్రామీణ కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉండటంతో, ఈ వ్యాధి సామాజిక, ఆర్థిక ప్రభావం తీవ్రమైందని పేర్కొన్నారు.

వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. అందులో భాగంగా 52,979 పందులను కలింగ్ (నరికివేత) చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే 9,711 పందులు వ్యాధితో మృతి చెందగా, మరో 3,615 పందులను శాస్త్రీయంగా వధించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ గణాంకాల ప్రకారం ఈ వైరస్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారని మంత్రి తెలిపారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రభావం కేవలం పంది పెంపకదారులకే కాకుండా, మాంసాహార సరఫరా, మార్కెట్ ధరలు, గ్రామీణ ఉపాధిపై కూడా పడిందని శాసనసభలో చర్చ జరిగింది. అనేక ప్రాంతాల్లో పంది మాంసం ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని, రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయిందని సభ్యులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక విధాన నిర్ణయం తీసుకుందని మంత్రి లాల్సావివుంగా తెలిపారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కలింగ్ చేసిన జంతువులకు మాత్రమే పరిహారం అందుతుందని, అయితే మిజోరం ప్రభుత్వం 2024లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌‌‌‌‌‌ను “రాష్ట్ర-నిర్దిష్ట విపత్తు”గా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి లాల్దుహోమా నాయకత్వంలో తీసుకున్నదని చెప్పారు. దీని వల్ల వ్యాధితో మృతి చెందిన పందులకూ పరిహారం చెల్లించే అవకాశం ఏర్పడిందన్నారు.

రాష్ట్ర విపత్తు స్పందన నిధి మార్గదర్శకాల ప్రకారం, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా మృతి చెందిన ప్రతి పందికి రూ.4,000 ఎక్స్‌గ్రేషియా సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా పరిహారం పంది పెంపకదారులకు పంపిణీ చేసినట్లు ఆయన శాసనసభకు తెలియజేశారు. భవిష్యత్తులో వ్యాధి నియంత్రణకు బయోసెక్యూరిటీ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, పశువైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది అన్నారు.