Let's talk: editor@tmv.in
ఆఫ్ఘాన్‌లోని టెక్నికల్‌ మిషన్‌ను ఎంబసీగా అప్‌గ్రేడ్‌ చేసిన భారత్‌

ఆఫ్ఘాన్‌లోని టెక్నికల్‌ మిషన్‌ను ఎంబసీగా అప్‌గ్రేడ్‌ చేసిన భారత్‌

Pinjari Chand
22 అక్టోబర్, 2025

భారత్‌ ప్రభుత్వం ఆఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌ ఉన్న టెక్నికల్‌ మిషన్‌ స్థాయిని తిరిగి భారత రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ఈ నిర్ణయాన్ని ఇటీవల భారత్‌ను సందర్శించిన ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాకీతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. అక్టోబర్‌ 9 నుంచి 16 వరకు ముత్తాకీ భారత్‌ లో పర్యటించారు.విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారత్‌–ఆఫ్ఘాన్‌ మధ్య అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఆఫ్ఘాన్‌ సమాజ అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా భారత్‌ అభివృద్ధి, మానవతా సహాయం, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరిస్తుంది అని పేర్కొంది.

కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత్‌ ఆఫ్ఘానిస్థాన్‌ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రానికి కట్టుబడి ఉంది. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ అభివృద్ధికి, ప్రాంతీయ స్థిరత్వానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశంలో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, పరస్పర సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పునరుద్ఘాటించారు. ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రి ముత్తాకీ ఆఫ్ఘానిస్థాన్‌ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతించమని తేల్చిచెప్పారు. అలాగే, భూకంప బాధిత ప్రాంతాల పునర్నిర్మాణానికి భారత్‌ సహాయం అందించేందుకు సిద్ధమని జైశంకర్ తెలిపారు. భారత మానవతా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. రెండు దేశాలు వాణిజ్య, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు అంగీకరించాయి. కొత్తగా ప్రారంభమైన ఇండియా–ఆఫ్ఘాన్‌ ఎయిర్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆఫ్ఘాన్‌ వైపు నుంచి భారత కంపెనీలను మైనింగ్‌ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానించారు. అంతేకాక, భారత సహకారంతో నిర్మించిన సల్మా డ్యామ్‌ (ఇండియా–ఆఫ్ఘాన్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌) ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యతను రెండు దేశాలు గుర్తించాయి. భవిష్యత్తులో జలవనరులు, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయాలని అంగీకరించాయి. ఈ నిర్ణయంతో భారత్‌–ఆఫ్ఘాన్‌ మధ్య దౌత్య, ఆర్థిక, మానవతా సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు భారత్ ఎంబసీని మూసివేసింది. అక్కడ కొంతమంది ఉద్యోగులతో టెక్నికల్‌ మిషన్‌ ను ఏర్పాటు చేసింది. వీరు అక్కడ భారత సహాయ ప్రాజెక్టులను పర్యవేక్షించడం, మానవతా సహాయం పంపిణీని చూడటం, స్థానిక అధికారులతో సాంకేతిక, పరిపాలనా విషయాల్లో సంప్రదింపులు కొనసాగించడం వంటి పరిమిత పనుల్లో బాధ్యతలు నిర్వహించారు.