
ఆఫ్ఘాన్ను ఆదుకోండి: ఐరాస
తూర్పు ఆఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయింది. ఈ విపత్తుతో సుమారు 4.57 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ విపత్తు నుంచి బాధితులకు సహాయం అందించేందుకు ఐక్య రాజ్య సమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సుమారు 140 మిలియన్ డాలర్ల అత్యవసర నిధుల కోసం విజ్ఞప్తి చేసింది.
సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు
ఈ భూకంపం వల్ల కునార్, లాఘ్మాన్, నంగర్హార్ ప్రావిన్స్లలో 2,210 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ అధికారులు తెలిపారు. 3,600 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స కోసం ఆసుపత్రుల్లో సరిపడా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6,700 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఐరాస అంచనా వేసిన ఈ 139.6 మిలియన్ డాలర్ల నిధులతో నాలుగు నెలల పాటు కునార్, లాఘ్మాన్, నంగర్హార్ ప్రాంతాల్లో బాధితులైన 4.57 లక్షల మందికి సహాయం అందించేందుకు సహాయ సంస్థలు కృషి చేస్తాయి. రహదారులు దెబ్బతినడం వల్ల 411 గ్రామాల్లో 49 గ్రామాలకు మాత్రమే ఇప్పటి వరకు సహాయక బృందాలు చేరుకోగలిగాయి. కొన్ని ప్రాంతాలకు హెలీకాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోగలుగుతున్నారు. సహాయక బృందాలు ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందించే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఐరాస ఆఫ్ఘానిస్థాన్ హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్ ఇంద్రికా రత్వత్తే తెలిపారు. ఇప్పటికే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు అంతర్జాతీయ సమాజం సంఘీభావం చూపాలని, శీతాకాలం రాకముందే సహాయం అందించడం కోసం సమయంతో పోటీపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సహాయ కార్యక్రమం ఏడాది చివరి వరకు కొనసాగుతుందని, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో సహాయ సంస్థలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నాయని ఐరాస తెలిపింది.
సహాయక చర్యలపైనే ఆధారం
ఈ భూకంపం ఆఫ్ఘానిస్థాన్లో ఇటీవలి కాలంలో సంభవించిన అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది. దేశం ఇప్పటికే దశాబ్దాలుగా యుద్ధం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ సహజ విపత్తు ప్రజల జీవన పరిస్థితులను మరింత దిగజార్చింది. రహదారులు దెబ్బతినడం, ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత వంటి సవాళ్లు సహాయ కార్యక్రమాలను సంక్లిష్టం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి నిధుల సేకరణ, పంపిణీ సమర్థవంతంగా జరగాలంటే స్థానిక అధికారులు, సహాయ సంస్థల మధ్య సమన్వయం కీలకం. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సమయం కీలకమైన అంశంగా మారింది. ఐరాస పిలుపు మేరకు ప్రపంచ దేశాలు, సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది ఆఫ్ఘాన్ ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
