
ఆఫ్ఘన్-పాక్ చర్చలు విఫలం: సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు!
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చల రెండో రౌండ్ మరోసారి విఫలమైంది. సరిహద్దుల్లో మళ్లీ హింస చెలరేగే ప్రమాదం ఉందని దీంతో ఇరుదేశాల్లో ఆందోళన మొదలైంది. చర్చల వైఫల్యానికి కారణాలపై ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
చర్చలు విఫలమవడానికి ఆఫ్ఘనిస్తాన్ పక్షమే కారణమని పాకిస్తాన్ తీవ్రంగా ఆరోపించింది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలనే ఇస్లామాబాద్ ప్రధాన డిమాండ్‌పై ఆఫ్ఘన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని పాకిస్తాన్ సమాచార, ప్రసారాల ఫెడరల్ మంత్రి అతావుల్లా తరార్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం స్పష్టమైన హామీ ఇవ్వకుండా "నిందారోపణలు, పక్కదారి పట్టించడం, కుయుక్తులకు" పాల్పడిందని తరార్ 'ఎక్స్’ వేదికగా విమర్శించారు.
“పాకిస్తాన్ పౌరుల రక్షణే మా ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటి మద్దతుదారులను నిర్మూలించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాం” అని అతావుల్లా తరార్ అన్నారు. ఖతర్, టర్కీ వంటి మధ్యవర్తిత్వ దేశాలకు ధన్యవాదాలు తెలుపుతూ “శాంతి పరిష్కారానికి చేసిన వారి నిజాయితీ ప్రయత్నాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని అన్నారు.
ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి బృందం చర్చల సమయంలో అంతగా సహకరించలేదని, సూటి ప్రశ్నలను దాటవేశారని పాక్ అధికారులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్ తుది డిమాండ్లలో కొన్నింటిని కాబూల్ తిరస్కరించడంతో పాకిస్తాన్ బృందం చివరికి చర్చల నుంచి వాకౌట్ చేసినట్లు 'టోలో న్యూస్' నివేదించింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రతిస్పందన
చర్చలు విఫలమవడానికి పాకిస్తాన్ వైఖరే కారణమని కాబూల్ కూడా ఎదురుదాడికి దిగింది. ఆఫ్ఘాన్ మీడియా ప్రకారం, ఆఫ్ఘాన్ అధికారులు పాకిస్తాన్ ప్రతినిధులు “సమన్వయం లేకుండా, స్పష్టమైన వాదనలు లేకుండా” వ్యవహరించారని ఆరోపించారు. ఆఫ్ఘాన్ పక్షం “తమ భూభాగాన్ని పాకిస్తాన్‌పై దాడుల కోసం వాడుకోనివ్వబోమని” మళ్లీ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ వైమానిక ఉల్లంఘనలు ఆపాలని, అమెరికా డ్రోన్ కార్యకలాపాలను నిరోధించాలని డిమాండ్ చేసింది. కానీ పాకిస్తాన్ ఈ షరతులను అంగీకరించలేదని సమాచారం.
ఇస్తాంబుల్ చర్చల విఫలమవడం, ఈ నెల ప్రారంభంలో ఖతర్‌లో జరిగిన మొదటి రౌండ్ విఫలమైన తర్వాత చోటుచేసుకుంది. అప్పట్లో ఇరుపక్షాలు “తక్షణ కాల్పుల విరమణ”పై అంగీకరించినప్పటికీ, ఇప్పుడు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ.. సరిహద్దు దాడులు, ఉగ్రవాద దాడులు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందన్నారు. ఇరుదేశాలు సైనిక, రక్షణ చర్యలకు సిద్ధమని సంకేతాలు ఇస్తుండటంతో, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పట్లో శాంతి నెలకొనడం కష్టమేమని తెలుస్తోంది.
