
ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సంక్షోభం: సహాయం నిలిపివేతతో ఆకలి కేకలు
ఆఫ్ఘనిస్తాన్‌లో మానవతా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సహాయంలో కోత విధించడం వల్ల మిలియన్ల మంది ఆఫ్ఘన్లు ఆకలితో అలమటిస్తున్నారు
సంక్షోభం తీవ్రత:
ఉదాహరణకి, కాబూల్‌లో నివసించే రహీముల్లా అనే వ్యక్తి రోజుకు 10 గంటల పాటు సాక్సులు అమ్ముతూ $4.5 నుండి $6 (సుమారు రూ.400 నుండి రూ.500) సంపాదిస్తాడు. తన ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని పోషించడానికి అతనికి ఉన్న ఏకైక మార్గం ఇది. రహీముల్లా లాంటి కోట్లాది మంది ఆఫ్ఘన్లు మనుగడ కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారుల సహాయంపై ఆధారపడుతున్నారు.
జనాభాలో సగం మందికి సహాయం అవసరం, అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రకారం, 2025లో దాదాపు 22.9 మిలియన్ల మందికి (జనాభాలో సగం) సహాయం అవసరమైంది. ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరిక ప్రకారం, ఈ చలికాలంలో 17 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 మిలియన్లు ఎక్కువ.
ఐక్యరాజ్యసమితికి అందే విరాళాలు తగ్గడంతో, గత ఏడాది 5.6 మిలియన్ల మందికి ఆహారం అందించగా, ఈ ఏడాది కేవలం 1 మిలియన్ మందికి మాత్రమే అందించగలిగారు. దీనితో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది.
కారణాలు:
ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి దిగజారడానికి అనేక కారణాలు తోడయ్యాయి. తాలిబన్ల పాలన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యింది. వరుస కరువులు రెండు భీకర భూకంపాలు దేశాన్ని దెబ్బతీశాయి. పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాల నుండి సుమారు 7.1 మిలియన్ల మంది ఆఫ్ఘన్ శరణార్థులు తిరిగి రావడంతో వనరులపై ఒత్తిడి పెరిగింది. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే తాలిబన్ల కఠిన నిబంధనల వల్ల లక్షలాది కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోయాయి.
బాధితుల గాధలు:
గతంలో సైనికుడిగా పనిచేసిన రహీముల్లా భార్య టీచర్‌గా పనిచేసేది. ఇప్పుడు ఆమెకు ఉద్యోగం లేదు. ఇంటి అద్దె దాదాపు రెట్టింపు కావడంతో, వచ్చే నెలలో తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక అతను ఆందోళన చెందుతున్నాడు. "పిండికి డబ్బులుంటే నూనెకు ఉండవు, నూనెకు ఉంటే అద్దె కట్టలేము" అని అతను తన ఆవేదన వ్యక్తం చేశాడు.
మరో బడిట కుటుంబ పరిస్థితి చూస్తే, బదక్షన్ ప్రావిన్స్‌కు చెందిన షెరీన్ గుల్ కుటుంబంలో 12 మంది సభ్యులు ఉన్నారు. వృద్ధుడైన భర్త, పది మంది పిల్లలతో ఉన్న ఆమె కుటుంబంలో కేవలం 23 ఏళ్ల కుమారుడు మాత్రమే అప్పుడప్పుడు దొరికే పనిపై ఆధారపడి ఉన్నాడు. "కొన్నిసార్లు నా చిన్న పిల్లలు ఏడుస్తూ ఖాళీ కడుపుతోనే పడుకుంటారు. వారికి కేవలం గ్రీన్ టీ ఇచ్చి పడుకోబెడతాను" అని ఆమె కన్నీరుమున్నీరైంది.
ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపిన వివరాల ప్రకారం, 2026 నాటికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం నుండి తగినంత మద్దతు లభించకపోతే, ఈ కఠినమైన చలికాలంలో ఆఫ్ఘన్ ప్రజలు పెను విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
