
ఆప్‌లో మాటల యుద్ధం
పంజాబ్‌కు సంబంధించిన కీలక సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తడంలో విఫలమయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ నేతలు, ముఖ్యంగా పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమా , రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను చద్దా పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు. ఇది పంజాబ్ ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుకు చేసిన ద్రోహమని అన్నారు. ఆప్ ఇటీవల చద్దాను రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించింది. దీనిపై స్పందించిన చద్దా తాను ఓడిపోలేదని, కేవలం ‘మౌనం వహించానని’ పేర్కొన్నారు. పంజాబ్ శాసనసభ సభ్యులు ఆయనను రాజ్యసభకు పంపినప్పుడు రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా ప్రస్తావిస్తారని ఆశించామని చీమా తెలిపారు. అయితే పంజాబ్‌కు సంబంధించిన ఒక్క కీలక అంశాన్నీ ఆయన పార్లమెంట్‌లో లేవనెత్తలేదని విమర్శించారు.
కేజ్రీవాల్ వల్లే ఎదిగారు
పంజాబ్‌కు రావాల్సిన సుమారు రూ.8,500 కోట్ల గ్రామీణాభివృద్ధి నిధి (ఆర్డీఎఫ్) బకాయిలు, జీఎస్‌టీలో మార్పుల వల్ల వచ్చిన రూ.60,000 కోట్ల నష్టం వంటి కీలక అంశాలను చద్దా ప్రస్తావించలేదని తెలిపారు. అలాగే జీఎస్‌టీ పరిహార విధానంలో మార్పుల కారణంగా రాష్ట్రానికి మరో రూ.5,000–6,000 కోట్ల నష్టం జరిగిన విషయాన్ని కూడా ఆయన లేవనెత్తలేదని చెప్పారు. ఇక వరదల వల్ల నష్టపోయిన పంజాబ్‌కు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.1,600 కోట్ల సహాయం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ మొత్తంలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకు చేరలేదని చీమా ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా చద్దా పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని అన్నారు. ఆప్ పంజాబ్ అధ్యక్షుడు, మంత్రి అమాన్ అరోరా కూడా చద్దాపై విమర్శలు గుప్పించారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనను రాజకీయంగా ఎదగడానికి సహకరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
పార్టీ ప్రతినిధి కుల్దీప్ సింగ్ దలీవాల్ కూడా చద్దా మౌనంపై నిరాశ వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రకటించిన రూ.1,600 కోట్ల సహాయంపై ఆయన పార్లమెంట్‌లో గొంతెత్తాల్సిందని అన్నారు. పంజాబ్ సమస్యలను ప్రతి వేదికలో ప్రస్తావించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ఆప్ నేతలు పేర్కొన్నారు. అలాంటి బాధ్యతను నిర్వర్తించకపోతే అది ప్రజల తీర్పును అవమానించినట్టేనని వారు హెచ్చరించారు.
నేను గాయపడ్డాను… అందుకే ఘాతకుడిని: ఆప్‌కు రాఘవ్ చద్దా కౌంటర్
తనపై ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) చేసిన ఆరోపణలను రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఖండించారు. తాను పార్లమెంట్‌కు ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి వెళ్లానేగానీ హంగామా సృష్టించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలు. ‘నేను గాయపడ్డాను… అందుకే ఘాతకుడిని’ (ఘాయల్ హూన్ ఇసిలియే ఘాతక్ హూన్)” అని ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యను ఆయన ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాలోని డైలాగ్‌ను ఉదహరిస్తూ చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో దాడి జరుగుతోందని కూడా ఆరోపించారు.
ఇటీవల ఆప్ ఆయనను రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ పార్లమెంట్‌లో ప్రతిపక్షం చేసిన వాకౌట్‌లకు తాను మద్దతు ఇవ్వలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రతిపక్షం వాకౌట్ చేసిన సందర్భంలో తాను మద్దతు ఇవ్వలేదని ఒక్క ఉదాహరణ చూపించాలని ఆప్‌కు సవాల్ విసిరారు. పార్లమెంట్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వీడియోలు పరిశీలిస్తే నిజం బయటపడుతుందని చెప్పారు. ముఖ్య ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలనే నోటీసుపై తాను సంతకం చేయలేదన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ఆ విషయంపై పార్టీ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని చెప్పారు. అంతేకాకుండా తన పార్టీకి చెందిన మరికొందరు ఎంపీలు కూడా ఆ నోటీసుపై సంతకం చేయలేదని గుర్తుచేశారు. పంజాబ్‌లో నీటి సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యం, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, రైల్వే ప్రయాణికుల సమస్యలు వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించానని చెప్పారు. జీఎస్‌టీ, ఆదాయ పన్ను, ప్రజా ఆరోగ్యం, విద్య, మహిళల మెన్స్ట్రువల్ హెల్త్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై కూడా తాను మాట్లాడినట్లు చద్దా పేర్కొన్నారు.
