Let's talk: editor@tmv.in
ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోంది: ఆర్మీచీఫ్

ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోంది: ఆర్మీచీఫ్

Pinjari Chand
14 జనవరి, 2026

‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో శత్రు పక్షం ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడినా వాటిని దృఢంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన జనరల్ ద్వివేది, సరిహద్దు ఉగ్రవాదానికి ప్రతిగా భారత సైన్యం సమతుల్యమైన, స్పష్టమైన వ్యూహంతో కూడిన చర్యలు చేపట్టిందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాల లోతుల్లోకి వెళ్లి ధ్వంసం చేయడంతో పాటు, ఇస్లామాబాద్‌ దీర్ఘకాలిక అణు బెదిరింపుల వ్యూహాన్ని చేదించగలిగామని తెలిపారు. మీకు తెలిసినట్లే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది. భవిష్యత్తులో జరిగే ఏదైనా సాహస చర్యకు మేము బలమైన ప్రతిస్పందన ఇస్తామని ఆయన అన్నారు. భారత ఆర్మీ తన దళాలను పూర్తిగా మోహరించిందని, అవసరమైతే భూతల దాడులకు సిద్ధంగా ఉందని కూడా ఆర్మీ చీఫ్ వెల్లడించారు.

పాకిస్థాన్ లోపల ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ మే 10న ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన అనంతరం, పశ్చిమ సరిహద్దు ప్రాంతం అలాగే జమ్మూ–కాశ్మీర్‌లో పరిస్థితి సున్నితంగానే ఉన్నప్పటికీ పూర్తిగా నియంత్రణలో ఉందని ఆర్మీ చీఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అలాగే 2025లో జమ్మూ–కాశ్మీర్‌లో ఉగ్రవాదుల నియామకాలు దాదాపు లేకపోవడం స్పష్టమైన సానుకూల మార్పుకు సంకేతమని అన్నారు.2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని, వారిలో 65 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారని జనరల్ వెల్లడించారు.పహల్గాం దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను ‘ఆపరేషన్ మహాదేవ్’లో అంతం చేశాం. ప్రస్తుతం స్థానిక క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్ గానే ఉందని ఆయన చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి

2025లో కేవలం ఇద్దరే ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరారు. అంటే ఉగ్రవాద నియామకాలు దాదాపు లేనట్టే. జమ్మూ–కాశ్మీర్‌లో సానుకూల మార్పుకు బలమైన అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక రంగ పునరుజ్జీవనం, ప్రశాంతంగా సాగిన శ్రీ అమర్‌నాథ్ యాత్ర ప్రధాన సూచికలు. ఈ యాత్రకు 4 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గత ఐదేళ్ల సగటును మించింది. ఉగ్రవాదం నుంచి పర్యాటకానికి మార్పు క్రమంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు.

మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాల ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై పడకుండా నివారించేందుకు అస్సాం రైఫిల్స్, భారత సైన్యం, హోంశాఖతో కూడిన బహుళ సంస్థల భద్రతా వ్యవస్థ పని చేస్తోందని జనరల్ ద్వివేది తెలిపారు. మయన్మార్‌లో రెండో దశ ఎన్నికలు విజయవంతంగా పూర్తవడంతో, ఇకపై పరస్పర సహకారం మరింత మెరుగ్గా ఉంటుదని అన్నారు.

చైనాతో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, అయితే నిరంతర అప్రమత్తత అవసరమని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అగ్ర స్థాయి చర్చలు, పునరుద్ధరించిన సంప్రదింపులు, విశ్వాస నిర్మాణ చర్యల వల్ల పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. దీని వల్ల ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో మేత, హైడ్రోథెరపీ శిబిరాలు వంటి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎల్‌ఏసీ వెంట మా మోహరింపు సమతుల్యంగా, బలంగా కొనసాగుతోంది. అదే సమయంలో, ప్రభుత్వ సమగ్ర విధానంలో భాగంగా సామర్థ్య వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు.

మణిపూర్‌లో పరిస్థితి మెరుగుపడింది

భద్రతా దళాల తటస్థ, పారదర్శక, దృఢమైన చర్యలు, అలాగే ప్రభుత్వ ముందస్తు కార్యక్రమాల వల్ల 2025లో మణిపూర్‌లో పరిస్థితి స్పష్టంగా మెరుగైంది. డ్యూరాండ్ కప్ ప్రశాంతంగా నిర్వహించడం, సాంస్కృతిక ఉత్సవాలు మళ్లీ ప్రారంభం కావడం , 2025 సెప్టెంబరులో కుకి తిరుగుబాటు గ్రూపులతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్ఓఓ) ఒప్పందం పునరుద్ధరణ — ఇవన్నీ స్థిరత్వానికి ముఖ్య నిదర్శనాలని ఆయన వివరించారు.

మానవతా , విపత్తు సహాయ చర్యల (హెచ్​ఏడీఆర్)పై మాట్లాడిన ఆయన, భారత సైన్యం రెండు పొరుగు దేశాలు, 10 రాష్ట్రాల్లో పనిచేసి 30,000 మందికి పైగా ప్రజలను రక్షించిందని తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వరదల సమయంలో కూలిపోతున్న భవనం నుంచి సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఆర్మీ విమాన హెలికాప్టర్ ద్వారా ధైర్యంగా రక్షించిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారిక అభ్యర్థనలు రాకముందే సైన్యం స్పందించగలిగింది. ఇవన్నీ విపత్తుల సమయంలో సైన్యం సహజమైన తొలి స్పందనకర్తగా ఉన్నదని నిరూపిస్తున్నాయని జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.

ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోంది: ఆర్మీచీఫ్ - Tholi Paluku