Let's talk: editor@tmv.in
ఆపరేషన్ సిందూర్‌లో అవసరమైనంతే చేశాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో అవసరమైనంతే చేశాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Pinjari Chand
8 డిసెంబర్, 2025

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక దళాలు "చాలా ఎక్కువ" చేయగలిగి ఉండేవి కానీ కావలసినంత మాత్రమే చేస్తూ ఉద్దేశపూర్వకంగా సంయమనం పాటించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు. దేశవ్యాప్తంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించిన రికార్డు స్థాయి 125 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ వల్లే ఈ విజయవంతమైన సైనిక ఆపరేషన్ సాధ్యమైందని నొక్కి చెప్పారు.

లడఖ్‌తో సహా అన్ని సరిహద్దు ప్రాంతాలతో మన కమ్యూనికేషన్, కనెక్టివిటీని బలోపేతం చేయడమే మా నిరంతర ప్రయత్నం. ప్రతి సరిహద్దు ప్రాంతం సమగ్ర అభివృద్ధికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అని అన్నారు.దేశీయ రక్షణ తయారీ రంగంలో వృద్ధిని ఉటంకిస్తూ 2014లో రూ.46,000 కోట్ల నుంచి ఇప్పుడు రికార్డు స్థాయి రూ.1.51 లక్షల కోట్లకు చేరినట్టు ఆయన పేర్కొన్నారు. దిగుమతి ఆధారిత దేశం నుంచి తయారీదారు-ఎగుమతిదారుగా భారత్ ఎదిగిందని చెప్పారు.కొన్ని నెలల క్రితమే పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించాయి. ఉగ్రవాదులకు ఏం జరిగిందో ప్రపంచం చూసింది.మనం కోరితే ఇంకా చాలా ఎక్కువ చేయగలిగేవాళ్లం. కానీ మన దళాలు ధైర్యంతో పాటు సంయమనం కూడా ప్రదర్శించాయి. కావలసింది మాత్రమే చేశాయి అని వివరించారు.

నిరంతరాయంగా కనెక్టివిటీ

బలమైన కనెక్టివిటీ వల్లే ఇంత పెద్ద ఆపరేషన్ సాధ్యమైందని తెలుపుతూ మన సైనిక దళాలు సకాలంలో లాజిస్టిక్స్ అందించగలిగాయి. సరిహద్దు ప్రాంతాలతో కనెక్టివిటీ నిరంతరాయంగా కొనసాగడంతో ఆపరేషన్ సిందూర్ చారిత్రక విజయం సాధించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సాయుధ దళాలు, పౌర పరిపాలన, సరిహద్దు ప్రాంత ప్రజల మధ్య చూపిన సమన్వయం అద్భుతం. లడఖ్ సరిహద్దు ప్రాంత ప్రజలందరికీ నా కృతజ్ఞతలు అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో (26 మంది పర్యాటకులతో సహా) ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉగ్ర మౌలిక సదుపాయాలపై భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి. సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతను బహుముఖంగా మార్చివేస్తోందని, కఠినమైన ప్రాంతాల్లో సైనికులు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

మన సైనికులు స్థిరంగా నిలబడుతున్నారు

ఈ రోజు మన సైనికులు కఠిన ప్రాంతాల్లో కూడా స్థిరంగా నిలబడగలుగుతున్నారు ఎందుకంటే వారికి రోడ్లు, రియల్ టైమ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహ సహాయం, నిఘా నెట్‌వర్క్‌లు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ లభిస్తున్నాయి అని ఆయన అన్నారు. మెరుగైన కనెక్టివిటీ భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా నడిపిస్తోందని ఆయన నొక్కి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ వృద్ధి అనుకూల విధానాలు, దేశవ్యాప్త సంస్కరణలతో పాటు బలమైన కమ్యూనికేషన్-కనెక్టివిటీ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.

గతంలో ఆయుధాలు, పరికరాల తయారీకి బలమైన వ్యవస్థ లేని భారత్ గత దశాబ్ద కాలంలో నిరంతర ప్రయత్నాలతో భారీ మార్పు చవి చూసిందని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో మన కఠోర శ్రమ వల్ల 2014లో సుమారు రూ.46,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి ఇప్పుడు రికార్డు స్థాయి రూ.1.51 లక్షల కోట్లకు చేరింది. 10 ఏళ్ల క్రితం రూ.1,000 కోట్ల కన్నా తక్కువగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు రూ.24,000 కోట్లకు చేరాయి అని తెలిపారు.

బీఆర్వో కృషి అమోఘం

నూతనంగా పూర్తి చేసిన 125 ప్రాజెక్టులను సరిహద్దు మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.రూ.5,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వ్యూహాత్మక ప్రాజెక్టులు లడఖ్, జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మిజోరం, పశ్చిమ బెంగాల్ తో సహా ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 28 రోడ్లు, 93 వంతెనలు, నాలుగు ఇతర పనులు ఉన్నాయి. బీఆర్వో చరిత్రలో ఒకే రోజు అత్యధిక విలువైన పనులు ప్రారంభోత్సవంగా ఈ కార్యక్రమం నిలిచింది. ప్రాజెక్టులను గడువు కన్నా ముందుగానే పూర్తి చేస్తూ, ఆత్మనిర్భర్ భారత్ దృష్టికి అనుగుణంగా కొత్త సాంకేతికతలను అవలంబిస్తూ బీఆర్వో నిరంతరం రాణిస్తోందని సింగ్ ప్రశంసించారు.

సరిహద్దు కనెక్టివిటీ బలోపేతం

భద్రతను పటిష్ఠం చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరిస్తోందని, విపత్తు ప్రతిస్పందనను మెరుగుపరుస్తోందని (జమ్మూ-కాశ్మీర్‌లోని చసూట్‌లో మేఘ విస్ఫోటం తర్వాత రక్షణ కార్యకలాపాల్లో చూసినట్టు), దూరపు ప్రాంతాల్లో పాలనపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతోందని ఆయన చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్‌తో భాగస్వామ్యంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన క్లాస్-70 మాడ్యులర్ వంతెనలను బీఆర్వో అవలంబిస్తున్నట్టు ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి రూ.16,690 కోట్ల ఖర్చు చేసిందని, 2025-26లో రూ.18,700 కోట్ల లక్ష్యం నిర్దేశించినట్టు చెబుతూ, ఇది బీఆర్వో సామర్థ్యాలపై ప్రభుత్వ విశ్వాసాన్ని సూచిస్తుందని తెలిపారు. గత రెండేళ్లలో 356 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడం వ్యూహాత్మక అభివృద్ధిలో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచిందని ఒక అధికారి తెలిపారు.

ఆపరేషన్ సిందూర్‌లో అవసరమైనంతే చేశాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ - Tholi Paluku