Let's talk: editor@tmv.in
ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన

ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన

T Venkata Ramana
9 అక్టోబర్, 2025

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన చారిత్రాత్మక ‘ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత వైమానిక దళం తన అపార శక్తిని, లక్ష్యాలను సాధించడంలో ఉన్న కచ్చితత్వాన్ని ప్రపంచానికి మరోసారి నిరూపించింది. శత్రులక్ష్యాలపై భారత వాయుసేన చేపట్టిన ధైర్యవంతమైన, కచ్చితమైన దాడులు దేశ ప్రజల మనసుల్లో వైమానిక దాడుల ప్రాధాన్యాన్ని తిరిగి నిలబెట్టాయని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. బుధవారం హిండన్ ఎయిర్‌బేస్‌లో జరిగిన 93వ వాయుసేన దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ "తక్కువ కాలంలోనే యుద్ధ ఫలితాలను మార్చే శక్తిగా వాయుసేన తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది" అని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన అమలు ద్వారా ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఈ ఆపరేషన్ ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన కొనియాడారు.

శక్తిసామర్థ్యాన్ని నిరూపించాం

ఈ ఆపరేషన్‌లో ఐఏఎఫ్ ప్రదర్శన తమకు వృత్తిపరమైన గర్వాన్ని నింపిందని, కొద్ది రోజుల్లోనే సైనిక ఫలితాలను సాధించడంలో వైమానిక శక్తి సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు.

ఆపరేషన్‌లో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, ప్లాట్‌ఫారమ్‌ల అద్భుతమైన పనితీరు శత్రు భూభాగంలోకి వెళ్లి ఖచ్చితమైన దాడులు చేయగలిగాయని తెలిపారు.ఇది మేక్ ఇన్ ఇండియా సామర్థ్యాలపై ఐఏఎఫ్‌కు ఉన్న విశ్వాసాన్ని నిరూపించింది. 1948, 1971, 1999 యుద్ధాలతో పాటు, బాలాకోట్ దాడులు, ప్రస్తుత ఆపరేషన్ సింధూర్‌ వంటి ప్రతి శకంలోనూ వాయుయోధులు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఐఏఎఫ్ కేవలం ఆకాశానికి రక్షకురాలు మాత్రమే కాదని, దేశ గౌరవానికి సంరక్షకురాలు కూడా అని పునరుద్ఘాటించారు.

వాయుసేన కార్యాచరణ ప్రణాళికల్లోకి కొత్త వ్యవస్థలు, ఆయుధాలు, పరికరాలను వేగంగా అనుసంధానించడం ముఖ్యమైన విజయమని ఆయన అన్నారు. వాయుయోధుల్లో జవాబుదారీతనం, భద్రత యొక్క సంస్కృతి పెరగడం వల్ల ప్రమాదాలు తగ్గాయని తెలియజేశారు. పోరాట పాత్రతో పాటు ఐఏఎఫ్ దేశీయంగా, విదేశాలలో చేపట్టిన మానవతా సహాయం, విపత్తు ఉపశమనం కార్యకలాపాలను ఆయన ప్రశంసించారు. ఇరాన్, ఇజ్రాయెల్ వంటి సంఘర్షణ ప్రాంతాల నుండి భారతీయ పౌరులను తరలించిన 'ఆపరేషన్ సింధూర్ ' వంటి మిషన్ సేవ కంటే ముందు స్వీయ సేవ అనే ఆదర్శాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఏకే సింగ్ అన్నారు.

'ఆపరేషన్ సిందూర్'

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఇది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఉద్దేశపూర్వక, శిక్షణాత్మక సైనిక చర్య. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిగాయి. వీటిలో ముఖ్యంగా లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయం ఉన్న మురీద్‌కే, జైషే-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్‌పూర్ వంటి కీలక స్థావరాలు ఉన్నాయి. మే 7న తెల్లవారుజామున భారత్ 24 క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిలో మసూద్ అజార్ బావమరుదులు సహా కీలక ఉగ్రవాదులు ఉన్నారని భారత సైన్యం వెల్లడించింది.

త్రివిధ దళాల సమన్వయం

ఈ ఆపరేషన్‌లో సైన్యం, వాయుసేన, నౌకాదళం మధ్య సమన్వయం కనిపించింది. భూమి, గగనతలం, సముద్రం ఈ మూడు రంగాలలోనూ ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

భారత దాడుల తరువాత, పాకిస్తాన్ సైనిక స్థావరాలను, భారత భూభాగంలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు ప్రయత్నించింది. ఈ దశలో భారత వాయుసేన సత్తా చాటింది.

వాయు రక్షణ వ్యవస్థల విజయం

గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 600కు పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసినట్టు ధృవీకరించారు. భారత దాడులను అడ్డుకోలేక పదేపదే ప్రతీకార దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు ఐఏఎఫ్‌ వ్యూహాత్మకంగా ఆ దేశంలోని ప్రధాన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. నూర్ ఖాన్, రిఫికి, సుక్కూర్, జకోబాబాద్, సర్గోధా వంటి ప్రధాన ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది. కనీసం 12 నుండి 13 పాకిస్తాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.కే.సింగ్ తెలిపారు. వీటిలో అమెరికాకు చెందిన ఎఫ్‌-16 , చైనాకు చెందిన జేఎఫ్‌-17లు ఉన్యని, గ్రౌండ్‌లో ఉన్న విమానాలు, గగనతలంలో కూల్చివేసిన విమానాలు ఇందులో ఉన్నాయని వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన - Tholi Paluku