Let's talk: editor@tmv.in
ఆపరేషన్ సాగర్ బంధు: శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల తుఫాను సాయం ప్రకటించిన భారత్

ఆపరేషన్ సాగర్ బంధు: శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల తుఫాను సాయం ప్రకటించిన భారత్

Shaik Mohammad Shaffee
24 డిసెంబర్, 2025

శ్రీలంకలో 'దిత్వా' తుఫాను సృష్టించిన విలయానికి ఆ దేశం అతలాకుతలమైంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలవడానికి భారత్ 450 మిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అక్కడి విదేశాంగ మంత్రి విజిత హెరత్‌తో కలిసి ఈ వివరాలను వెల్లడించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దూతగా జైశంకర్ శ్రీలంకకు వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ రాసిన లేఖను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేకు అందజేశారు. " దిత్వా తుఫాను సమయంలో శ్రీలంకకు తోడుగా నిలవడం భారత్‌కు గర్వకారణం” అని జైశంకర్ అన్నారు. 2022 ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక క్రమంగా కోలుకుంటున్న సమయంలో ఈ తుఫాన్ కొత్త సమస్యలను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంక ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా సహాయం చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు.

భారత్ ప్రతిపాదించిన 450 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లు తక్కువ వడ్డీతో రుణాలుగా, 100 మిలియన్ డాలర్లు నేరుగా గ్రాంట్ల రూపంలో ఉంటాయని జైశంకర్ వివరించారు. ఈ సహాయ ప్యాకేజీని శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుది రూపం ఇస్తున్నామని చెప్పారు.

ఈ సహాయం ముఖ్యంగా తుఫాన్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. రహదారులు, రైల్వేలు, వంతెనల మరమ్మత్తు, పూర్తిగా లేదా కొంతమేర దెబ్బతిన్న ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యం, విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, వ్యవసాయ రంగానికి మద్దతు, భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం వంటి అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు. తుఫాను తీవ్రత దృష్ట్యా శ్రీలంకకు సహాయం చేయడం సహజమేనని జైశంకర్ అన్నారు. దిత్వా తుఫాన్ తీరాన్ని తాకిన తొలి రోజే భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభించిందని గుర్తు చేశారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ ఉదయగిరి నౌకలు కొలంబో చేరి సహాయక సామగ్రిని అందించాయి. అలాగే హెలికాప్టర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన మి-17 హెలికాప్టర్లు రెండు వారాలకుపైగా శ్రీలంకలో సేవలందించాయని తెలిపారు.

జాతీయ విపత్తు స్పందన బలగానికి చెందిన 80 మంది సభ్యులు సహాయక, రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా 1,100 టన్నులకుపైగా ఆహార ధాన్యాలు, టెంట్లు, టార్పాలిన్లు, హైజిన్ కిట్లు, బట్టలు, తాగునీటి శుద్ధి కిట్లు వంటి సహాయ సామగ్రిని శ్రీలంకకు పంపినట్లు జైశంకర్ తెలిపారు.

అదనంగా 14.5 టన్నుల మందులు, వైద్య పరికరాలు, మరో 60 టన్నుల పరికరాలను సహాయక చర్యల కోసం అందించినట్లు చెప్పారు. భారత ఆర్మీ ఇంజినీర్లు కిలినోచ్చిలో బైలీ వంతెనను నిర్మించారని, చిల్లాల్ ప్రాంతంలో మరో బైలీ వంతెన నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.

శ్రీలంక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి భారత పర్యాటకులు అక్కడికి వెళ్లేలా ప్రోత్సహిస్తామని జైశంకర్ చెప్పారు. అలాగే, భారత్ నుండి పెద్ద కంపెనీలు శ్రీలంకలో పెట్టుబడులు పెడితే, ఈ కష్టకాలంలో ఆ దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'శ్రీలంక ప్రజల ధైర్యం మరియు ఓర్పు మాకు తెలుసు.. ఏ కష్టం వచ్చినా భారత్ ఎప్పుడూ శ్రీలంకకు అండగా ఉంటుంది' అని జైశంకర్ భరోసా ఇచ్చారు.